చరిత్ర సృష్టించిన బ్రావో.. టీ20లలో బౌలర్లెవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం

First Published Aug 12, 2022, 1:10 PM IST

DJ Bravo Record: వెస్టిండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో ప్రపంచ క్రికెట్ లో అరుదైన ఘనత సాధించాడు.   పొట్టి క్రికెట్  ఫార్మాట్ స్పెషలిస్టుగా ఉన్న బ్రావో.. ఈ ఫార్మాట్ లో మరే బౌలర్ కు సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్నాడు. 

టీ20  క్రికెట్ లో వెస్టిండీస్ వెటరన్ పేసర్ డ్వేన్ బ్రావో చరిత్ర సృష్టించాడు.  ఈ ఫార్మాట్ లో ఇతర బౌలర్లకు సాధ్యం కాని అరుదైన ఘనతను అతడు సొంతం చేసుకున్నాడు.  టీ20లలో బ్రావో.. 600 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. 

38 ఏండ్ల బ్రావో.. ఇంగ్లాండ్ లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ లీగ్ లో భాగంగా ఓవల్ ఇన్విన్సీబుల్స్ తో మ్యాచ్ ఆడుతూ ఈ ఘనతను అందుకున్నాడు.  ది హండ్రెడ్ లీగ్ లో నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ తరఫున ఆడుతున్న బ్రావో..  రిలీ రూసోను ఔట్ చేయడం ద్వారా  టీ20లలో  600 వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ గా అవతరించాడు. 

టీ20 స్పెషలిస్టు అయిన బ్రావోకు ఇది 545వ మ్యాచ్. వెస్టిండీస్ జాతీయ జట్టు తరఫున 91 మ్యాచులాడిన బ్రావో.. 78 వికెట్లు పడగొట్టాడు.   మిగిలిన 522 వికెట్లు వివిధ ఫ్రాంచైజీలలో ఆడినవే కావడం విశేషం. 

బ్రావో వెస్టిండీస్ జాతీయ జట్టు తరఫున కాక.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ తో పాటు వెస్టిండీస్ లోనే జరిగే కరేబియన్ ప్రీమియర్ లీగ్,  పాకిస్తాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్ లలో పాల్గొంటున్నాడు. తాజాగా అతడు ది హండ్రెడ్ లో కూడా చేరాడు.

Image credit: PTI

టీ20లలో బ్రావో తర్వత అత్యధిక వికెట్లు తీసినవారి జాబితాలో అఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ ఖాన్ 339 మ్యాచ్ లలో  466 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత వెస్టిండీస్ కే చెందిన సునీల్ నరైన్ 460, ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా) 451, షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) 418, లసిత్ మలింగ (శ్రీలంక) 390, సోహైల్ తన్వీర్ (పాకిస్తాన్) 380, వహబ్ రియాజ్ (పాకిస్తాన్) 379 లు ఉన్నారు.

Lasith Malinga

బ్రావో తీసిన వికెట్లలో  183 వికెట్లు ఐపీఎల్ లో పడగొట్టినవే. ఐపీఎల్ లో బ్రావో.. 161 మ్యాచ్ లలో 183 వికెట్లు తీశాడు.  15 సీజన్లలో అతడు రెండు సార్లు పర్పుల్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. గత సీజన్ లో అతడు.. ఈ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న లసిత్ మలింగ రికార్డును అధిగమించి అగ్రస్థానానికి చేరాడు. ఐపీఎల్ లో మలింగ 170 వికెట్లు తీశాడు. 

click me!