మరోసారి కెప్టెన్‌ను మార్చిన బీసీసీఐ.. జింబాబ్వే టూర్‌కు సారథిగా రాహుల్

First Published Aug 12, 2022, 12:42 PM IST

India Tour Of Zimbabwe: ఈనెల  18 నుంచి భారత జట్టు జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ కోసం గతంలో శిఖర్ ధావన్  సారథిగా పేరును ముందు ప్రకటించినా తాజాగా కెప్టెన్ మారాడు. 

Shikhar Dhawan

‘సిరీస్‌కు ఒక సారథి’ అనే ఫార్ములాను తూచా తప్పకుండా పాటిస్తున్న బీసీసీఐ పెద్దలు జింబాబ్వే టూర్‌కూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.  వెస్టిండీస్ తో వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ కెప్టెన్ గా ఉండగా టీ20 సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ  జట్టును నడిపించాడు. 
 

ఇక జింబాబ్వే టూర్ లో కెఎల్ రాహుల్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. వాస్తవానికి జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు  శిఖర్ ధావన్ ను సారథిగా ప్రకటించింది బీసీసీఐ. కానీ  తాజాగా అతడిని మార్చి  రాహుల్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. 

ఐపీఎల్ ముగిసిన తర్వాత రాహుల్ భారత జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ముందు అతడినే సారథిగా నియమించినా చివరి నిమిషంలో గాయంతో అతడు సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో రిషభ్ పంత్ భారత జట్టుకు కెప్టెన్ గా పనిచేశాడు.  గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడానికి రాహుల్.. జర్మనీకి వెళ్లివచ్చాడు. 


ఆ తర్వాత అతడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో శిక్షణ పొందాడు. ఈ క్రమంలో అతడు వెస్టిండీస్ తో సిరీస్ కు ఎంపికయ్యాడు. కానీ ఫిట్నెస్ టెస్టుకు ముందే అతడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు మళ్లీ జట్టుకు దూరమయ్యాడు.  తాజాగా అతడికి ఫిట్నెస్ టెస్టు నిర్వహించగా అందులో పాసయ్యాడు.  

ఫిట్నెస్ టెస్టు పాస్ కావడంతో జింబాబ్వే టూర్ లో భారత కెప్టెన్ ను మార్చింది బీసీసీఐ. ఆసియా కప్ కు ముందు రాహుల్ కు ప్రాక్టీస్ కూడా అవుతుందని భావించిన జట్టు యాజమాన్యం.. అతడిని జింబాబ్వేకు పంపనుంది. ఇప్పటికే ప్రకటించిన  15 మందితో పాటు రాహుల్ పేరును చేర్చి మొత్తం 16 మంది సభ్యులతో కూడిన  జట్టును అప్డేట్ చేసింది.  

రాహుల్ రావడంతో ధావన్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. జింబాబ్వే పర్యటనలో భారత జట్టు.. 18, 20, 22 తేదీలలో హరారే వేదికగా మూడు వన్డేలను ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను కాకుండా ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. 

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు : కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శుబ్‌మన్‌ గిల్, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్‌ ఠాకూర్, కుల్దీప్‌ యాదవ్, అక్షర్‌ పటేల్, అవేశ్‌ ఖాన్, ప్రసిధ్‌ కృష్ణ, దీపక్‌ చహర్, మహమ్మద్‌ సిరాజ్

click me!