క్రికెటర్లు ఇలా దేశాలు పట్టుకుపోతే.. మన క్రికెట్ పోయినట్టే.. విండీస్ మాజీల ఆందోళన.. కమిటీలో విస్తుపోయే నిజాలు

First Published Jan 20, 2023, 5:54 PM IST

West Indies Cricket: ప్రపంచం నలుమూలలా  ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా కరేబియన్ వీరులు ముందుంటారు.  బాల్, బ్యాట్ తో పాటుతో విండీస్ వీరులు చేసే విన్యాసాలు  అభిమానులను అలరిస్తాయి.  అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు.  మరోవైపు మాత్రం..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్),  పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్),  అబుదాబి టీ10 లీగ్, సౌతాఫ్రికా టీ20 (ఎస్ఎ 20), ది హండ్రెడ్ (ఇంగ్లాండ్), ఇంటర్నేషనల్ టీ20 (ఐఎల్ టీ20).. ఇలా లీగ్ లు ఏవైనా  తప్పక  కనిపించే ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా..? అంటే ఠక్కున  వచ్చే సమాధానం వెస్టిండీస్ ప్లేయర్లు.  

ప్రపంచం నలుమూలలా  ఎక్కడ లీగ్ జరిగినా  కరేబియన్ వీరులు ముందుంటారు.  బంతి, బ్యాట్ తో పాటుతో అద్భుతాలు చేసే ఆ ఆటగాళ్ల విన్యాసాలు  అభిమానులను అలరిస్తాయి.  అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు.  మరోవైపు మాత్రం  ఈ క్రికెటర్లంతా  వెస్టిండీస్ జట్టుకు ఆడమంటే  ‘నో   నో..’ అంటున్నారు. ఫలితంగా  ఆ జట్టుకు   క్రికెట్ ఆడటానికి నిఖార్సైన ఆటగాళ్లు దొరకడం లేదు.  

ఒకప్పుడు  క్రికెట్ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలి వరుసగా రెండు ప్రపంచకప్ లు నెగ్గి.. గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్,  ఆంబ్రోస్, కోట్నీ వాల్ష్, బ్రియాన్ లారా,  శివనారాయణ్ చందర్‌పాల్ వంటి దిగ్గజాలతో  అందించిన  విండీస్ జట్టు తర్వాత గాడి తప్పింది.   
 

టీ20ల వల్ల  విండీస్ ఆటగాళ్లలో చాలా మార్పులు వచ్చాయి. క్రిస్ గేల్,  కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్,  ఆండ్రూ రసెల్, డారెన్ సామి,   సామ్యూల్స్ వంటి సీనియర్లతో పాటు షిమ్రాన్ హెట్మెయర్,  రొవ్మన్ పావెల్, మెక్‌కాయ్,   నికోలస్ పూరన్ వంటి స్టార్లు కూడా  పొట్టి క్రికెట్ లో సత్తా చాటుతున్నారు. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు..  ప్రపంచవ్యాప్తంగా లీగ్ లలో అదరగొట్టే క్రికెటర్లు ఉన్నా  జాతీయ జట్టుకు ఆడేందుకు టీమ్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఆ  దేశపు క్రికెట్ బోర్డుది.  క్రికెటర్లు, బోర్డు మధ్య పొరపొచ్చాలు రావడం.. మాజీ  కోచ్ తో విభేదాల కారణంగా  ఆ జట్టు  నానాటికీ దిగజారింది. 

మరీ ముఖ్యంగా గతేడాది టీ20 ప్రపంచకప్ లో  ఆ జట్టు కనీసం క్వాలిఫై కూడా కాలేకపోయింది.  గతంలో రెండు దఫాలు టీ20 ప్రపంచకప్ నెగ్గిన ఓ జట్టు.. ఇలా క్వాలిఫై రౌండ్ లోనే వెనుదిరగడం అందర్నీ విస్తుగొలిపింది. అయితే ఇది ఇలాగే కొనసాగితే  జాతీయ జట్టు ఉనికికే ప్రమాదమని, ఈ వైఫల్యాలకు గల కారణాలను వెతకాలని  వెస్టిండీస్ క్రికెట్  బోర్డు.. బ్రియాన్ లారా నేతృత్వంతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు  చేసింది. 

లారా, దక్షిణాఫ్రికా మాజీ కోచ్ మికీ ఆర్థూర్, సీనియర్ జడ్జి  ప్యాట్రిక్ థాంప్సన్ తో కూడిన ఈ కమిటీ ఇటీవలే తమ నివేదికను  బోర్డుకు విన్నవించినట్టు అక్కడి మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నివేదికలో పేర్కొన్న అంశాల ప్రకారం.. ‘విండీస్ క్రికెట్ ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  లేకుంటే  రాబోయే కాలంలో అది తన ఉనికినే కోల్పోయే ప్రమాదం తప్పదు.  ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్న ఈ జట్టు అంచనాలతో మునిగిపోవద్దు.   

ముఖ్యంగా ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడకుండా   విదేశీ లీగ్ లలో ఆడేందుకు మొగ్గు చూపడం సరైంది కాదు.  ఇది చాలా తీవ్రమైన అంశం. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా  ఉంది. అందుకోసం నిజాయితీగా చర్చ జరగాలి.  క్రికెటర్లు, అడ్మినిస్ట్రేషన్  మధ్య  అపరిమితమైన అపనమ్మకం ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిని  వీలైనంత త్వరగా పరిష్కరించాలి. అంతేగాక అత్యుత్తమమైన 11 మంది ఆటగాళ్లను ఎంపిక  చేసే విధానం కూడా  ఏం బాగోలేదు...’ అని  కుండబద్దలు కొట్టింది. 

ప్రపంచవ్యాప్తంగా పలు జట్లు అనుసరిస్తున్న స్ప్లిట్ కోచింగ్ కు ఈ కమిటీ  పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.   పరిమిత ఓవర్ల జట్టుకు, టెస్ట్ జట్టుకు ఇద్దరు కోచ్ లు ఉండాల్సిన పన్లేదని తెలిపింది.  అలాగే టీ20లో ఆడే సభ్యులు టెస్టులకూ ప్రాధాన్యమివ్వాలని, ఆ విధంగా బోర్డు వారిని ప్రోత్సహించాలని సూచించింది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ లోపు జట్టును సమాయత్తం చేయాల్సిన అవసరముందని  సూచించింది. 2024లో  అమెరికా, విండీస్ దీవులలో  పురుషుల టీ20  ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. 

click me!