నువ్వు మాకో తలనొప్పి పెట్టి పక్కకు తప్పుకున్నావ్ : విరాట్ కోహ్లిపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

First Published Jan 17, 2022, 9:52 AM IST

Ashwin Praises Virat Kohli: టెస్టు కెప్టెన్ బాధ్యతల నుంచి  వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లికి ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో  అభినందనలు తెలిపాడు. 
 

రెండ్రోజుల క్రితం టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన  విరాట్ కోహ్లిపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి.. తమకు పెద్ద తలనొప్పిని పెట్టి వెళ్లిపోయాడని వాపోయాడు. 
 

ట్విట్టర్ వేదికగా స్పందించిన అశ్విన్ ఈ కామెంట్స్ చేశాడు. వరుస ట్వీట్లతో కోహ్లిని ఆకాశానికెత్తాడు. కెప్టెన్ గా కోహ్లి  సెట్ చేసిన బెంచ్ మార్క్ ను అందుకోవడం ఎవరి వల్ల కాదని పేర్కొన్నాడు.

అశ్విన్ స్పందిస్తూ.. ‘క్రికెట్ లో కెప్టెన్లు వస్తుంటారు.. పోతుంటారు.. వాళ్లు రిటైరైన తర్వాత చాలా మంది ఆ  నాయకుల రికార్డుల గురించి మాట్లాడుతుంటారు. కానీ నీ (కోహ్లి) వారసత్వం, నువ్వు సెట్ చేసిన బెంచ్ మార్కుల మీద నిలుస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, ఇతర దేశాల్లో నువ్వు సాధించిన విజయాలు అలాంటివి. 
 

విజయాలు అనేవి పంటకు ముందు నాటబడిన విత్తనాల ఫలితాలు. నువ్వు ఏర్పరిచిన ప్రమాణాలు మిగిలిన వారితో సెట్ చేయడం చాలా కష్టం. నీ వారసుడి కోసం వెతికే తలనొప్పిని మాకు అందించినందుకు థాంక్యూ కోహ్లి..  అది ఎంత కష్టమైన పనో నాకు తెలుసు..’ అని ట్వీట్ చేశాడు. 
 

కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు 68 టెస్టులు ఆడగా.. అందులో 40 విజయాలు సాధించింది. 11  టెస్టులు డ్రా గా ముగియగా.. 17 మ్యాచులలో టీమిండియా ఓడింది.  స్టీవ్ వా, రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్ తర్వాత అత్యధిక  విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. 

ఇక టెస్టు బౌలర్ గా అశ్విన్.. కోహ్లి సారథ్యంలోనే ఎక్కువగా ఆడాడు. 55 మ్యాచులలో అశ్విన్ ఏకంగా 293 వికెట్లు తీసుకున్నాడు.ఇందులో 21 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉండటం గమనార్హం. భారత్ తో పాటు విదేశాలలో కూడా అశ్విన్  రాణించడంతో టీమిండియా కు విజయాలు దక్కాయి.
 

click me!