Virat Kohli: అది నిర్ణయించాల్సింది నేను కాదు.. వాళ్లే తెలుసుకోవాలి.. రహానే ఫామ్ పై కోహ్లీ కీలక వ్యాఖ్యలు

First Published Dec 6, 2021, 5:59 PM IST

Ajinkya Rahane: ఫామ్ లేమితో తంటాలు పడుతున్న భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో  విరాట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

టెస్టులలో భారత వైస్ కెప్టెన్ అజింకా రహానే ఫామ్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. న్యూజిలాండ్ తో కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టుతో పాటు కొద్దిరోజుల క్రితం ముగిసిన ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో కూడా రహానే ఫామ్ అంతంత మాత్రమే.  కాన్పూర్ టెస్టుల్లో రెండు ఇన్నింగ్సులలో కలిపి రహానే 39 (35, 4) పరుగులు మాత్రమే చేయడం  గమనార్హం. 

ఈ నేపథ్యంలో త్వరలో జరుగబోయే సౌతాఫ్రికా పర్యటనకు రహానే ను పక్కనబెట్టాలని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు  క్రీడా విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అయితే దక్షిణాఫ్రికా టూర్ కు ముందు రహానే ఫామ్, జట్టులోకి అతడు తిరిగి  వస్తాడా..?  లేదా..? అనేదానిపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో టీమిండియా.. కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో విరాట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

కోహ్లీ స్పందిస్తూ.. ‘రహానే ఫామ్ గురించి నేను జడ్జ్ చేయలేను. నేనే కాదు ఎవరూ ఆ పని చేయలేరు. తమ లోపాలేమిటి..? వాటిని ఎలా పరిష్కరించుకోవాలన్న  అంశంపై సదరు ఆటగాడు దృష్టి సారించాల్సి ఉంటుంది. 

కీలక మ్యాచులలో తమ అద్భుత ప్రదర్శనతో ప్రభావం  చూపగలిగిన ఆటగాళ్లకు కష్టకాలంలో మేము మద్దతుగా నిలబడాల్సి ఉంటుంది.. ’ అని రహానేకు మద్దతుగా నిలిచాడు. 

అంతేగాక.. ‘ఒక వ్యక్తిపై ఒత్తిడి ఉన్నప్పుడు  పదే పదే అతడి ఫామ్ గురించి మాట్లాడుతూ...  ఇక తర్వాత ఏంటి.? అని అడుగుతుంటారు. అలా ఇష్టారీతిన మాట్లాడేవాళ్లను మేమస్సలూ సహించబోము. అంతేగాక..  బయిట కొంతమంది తమకు నచ్చిన ఆటగాళ్లకు మద్దతు పలికి.. ఆ తర్వాత వాళ్లను కూడా జట్టులోంచి తీసేయాలంటూ మాట్లాడతారు. వాళ్లను కూడా మేము పట్టించుకోము.. అలాంటి వాళ్లు చేసే విమర్శలపై మేమసలు స్పందించబోము..’ అని అన్నాడు. 

ఆటను ఆటలాగే  చూస్తామని, రహానే గానీ లేదంటే ఇతర ఆటగాడు గానీ ఎవరికైనా సరే తమ మద్దతు ఉంటుందని కోహ్లీ చెప్పాడు. బయిట పరిస్థితుల ఆధారంగా ఎవర్ని కొనసాగించాలి..? ఎవర్ని తీసేయాలి..? అన్న విషయాలపై నిర్ణయం తీసుకోబోమని ఘాటుగా స్పందించాడు.

మరోవైపు మహ్మద్ సిరాజ్ పై కూడా కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. అతడు నైపుణ్యం, అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాడు అని, బౌలింగ్ చేసిన ప్రతిసారి గొప్ప ప్రదర్శన చేస్తాడని కోహ్లీ కొనియాడాడు. సిరాజ్ ప్రదర్శనే అతడికి మంచి బూస్ట్ ఇస్తుందని, అలాంటి  క్రికెటర్ పై ఆధారపడొచ్చని తెలిపాడు. సిరాజ్ వంటి బౌలర్ ఉండటం ఏ జట్టుకైనా మంచిదే అని అన్నాడు. 

click me!