టీ20 ప్రపంచకప్ లో తొలి నుంచి వరుస విజయాలతో గ్రూప్-2లో టాప్ లో నిలిచిన భారత జట్టు.. అదృష్టం కొద్ది సెమీస్ చేరిన పాకిస్తాన్ జట్లు ఈ టోర్నీలో మరోసారి పోటీ పడాలని ఇరుదేశాల ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా కోరుకుంటున్నారు. సెమీస్ చేరిన ఇంగ్లాండ్- ఇండియా, న్యూజిలాండ్- పాకిస్తాన్ ల మధ్య విజేతలెవరో తేలాక ఫైనల్ ఎవరి మధ్య ఉండనుందనే దానిపై స్పష్టత రానుంది.
అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టుగా ఈ మెగా టోర్నీలో తాము ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ చూడటానికి ఇష్టపడటం లేదని.. రోహిత్ సేనకు షాకులిస్తామని ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ అన్నాడు. ఇండియాతో మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బట్లర్ మాట్లాడుతూ.. ‘చూడండి.. మాకు ఈ టోర్నీ ఫైనల్ లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని లేదు. అందుకే మేం మా ప్రణాళికలతో ఉన్నాం. అలాంటిది జరుగకుండా భారత జట్టును అడ్డుకుంటాం. అందుకు ఏం చేయాలో అది చేస్తాం.
భారత జట్టు చాలా స్ట్రాంగ్ టీమ్. చాలాకాలంగా భారత జట్టు నిలకడైన ఆటతీరుకు పెట్టింది పేరు. ఆ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. నాణ్యమైన ఆటగాళ్లు కూడా బెంచ్ కే పరిమితమవుతున్నారంటే ఆ జట్టు ఎంత దృఢంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..’ అని అన్నాడు.
ఈ టోర్నీలో అత్యద్భుత ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ గురించి బట్లర్ మాట్లాడుతూ.. ‘సూర్య ఆటను చూసినకొద్దీ చూడబుద్దవుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మెరుగ్గా ఆడిన వాళ్లలో సూర్య ఒకడు. తన కెరీర్ లో సూర్య చాలా క్రికెట్ ఆడాడు. అదే అతడి బలం. మైదానం నలుమూలలా అన్ని షాట్లు ఆడగల సమర్థుడు. సూర్య అంత త్వరగా వికెట్ ఇవ్వడు. కానీ మేం అతడిని ఔట్ చేసేందుకు మా ప్రయత్నాలు చేస్తాం..’ అని చెప్పాడు.
గాయంతో బాధపడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు డేవిడ్ మలన్, మార్క్ వుడ్ ల గురించి కూడా బట్లర్ స్పందించాడు. ‘మ్యాచ్ సమయానికల్లా వాళ్లు ఎలా ఉంటారనేది చూస్తున్నాం. మలన్ కు గాయం కావడంతో శ్రీలంకతో మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగలేదు. వుడ్ బాడీ స్టిఫ్నెస్ తో బాధపడుతున్నాడు. కానీ మా వైద్య సిబ్బంది వాళ్లిద్దరినీ పర్యవేక్షిస్తున్నది. మ్యాచ్ వరకూ ఆ ఇద్దరూ ఫిట్ గా ఉంటారని అనుకుంటున్నా..’ అని చెప్పాడు.