మా దగ్గర అన్ని డబ్బుల్లేవ్.. అతడే వస్తే మా క్రికెట్ బోర్డు అందర్నీ తొలగించాల్సిందే.. సూర్యపై ఆసీస్ ఆల్ రౌండర్

First Published Nov 23, 2022, 4:57 PM IST

తన కెరీర్ లో అత్యద్భుత ఫామ్ లో ఉన్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్  సూర్యకుమార్ యాదవ్  గత ఏడాది కాలంగా అత్యుత్తమ ప్రదర్శనలతో అలరిస్తున్నాడు.తాజాగా న్యూజిలాండ్ తో ముగిసిన టీ20 సిరీస్ లో కూడా సెంచరీతో చెలరేగాడు. 
 

గత ఏడాది కాలంగా  టీ20 క్రికెట్ లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నయా 360 సూర్యకుమార్ యాదవ్  తన కెరీర్ లోనే సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు.  టీ20 ప్రపంచకప్ లో మెరుపులు మెరిపించిన సూర్య.. తర్వాత న్యూజిలాండ్ సిరీస్ లో కూడా రాణించాడు.  రెండో టీ20లో 51 బంతుల్లోనే  111 పరుగులు చేశాడు. 

తాజాగా  సూర్యకుమార్ యాదవ్ ఆటపై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రశంసలు కురిపించాడు.  సూర్య ఆట మాటలకు అందడం లేదని.. అతడు వేరే ప్లానెట్ నుంచి వచ్చినట్టుగా ఆడుతున్నాడని కొనియాడాడు. అంతేగాక అతడే గనక  బిగ్ బాష్ లీగ్ లోకి  వస్తే తమ క్రికెట్ బోర్డుకు తిప్పలు తప్పవని ఫన్నీగా చెప్పాడు. 

Suryakumar Yadav

న్యూజిలాండ్ తో సిరీస్ ముగిశాక మ్యాక్స్వెల్ గ్రేడ్ క్రికెటర్ అనే  చర్చలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  మ్యాక్సీ మాట్లాడుతూ.. ‘అసలు ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ ఉందని నాకు తెలియదు. కానీ ఎందుకో నేను రిమోట్ మారుస్తుంటే టీవీలో స్కోరుబోర్డు కనబడింది. 

ఆ స్కోరు బోర్డు చూడగానే నా మైండ్ బ్లాంక్ అయింది. నేను వెంటనే  దానిని స్క్రీన్ షాట్ తీసి ఫించీ (ఆరోన్ ఫించ్) కు పంపించాను. ఫించ్ తో నేను.. ‘అసలేం జరుగుతోంది.. సూర్య వేరే ప్లానెట్  నుంచి వచ్చాడా..? అలా బ్యాటింగ్ చేస్తున్నాడేంటి..? అందరి స్కోర్లు చూడు. ఒక్క సూర్య స్కోరు చూడు’ అని  చెప్పా.

ఆ మ్యాచ్ ముగిశాక నేను రిప్లే చూశా.  ఆ ఇన్నింగ్స్ చూశాక నాకే ఏదోలా అనిపించింది. మేమంతా ఇలా ఎందుకు ఆడలేకపోతున్నామని  కాస్త సిగ్గుగా  ఫీలయ్యా.  సూర్య ఆట మాములుగా లేదు.  మేము అతడి దరిదాపుల్లోకి  కూడా వెళ్లం..’ అని అన్నాడు. 

ఇదే చర్చలో మరి సూర్య గనక బిగ్ బాష్ లీగ్ లోకి వస్తే ఎలా..? అని ప్రశ్నించగా దానికి మ్యాక్సీ సమాధానం చెబుతూ.. ‘సారీ. మా దగ్గర  అన్ని డబ్బుల్లేవు.  అసలు ఆ అవకాశమే లేదు. ఒకవేళ సూర్య గనక బీబీఎల్ లో ఆడాల్సి వస్తే క్రికెట్ ఆస్ట్రేలియా  తన కాంట్రాక్టు ఉన్న ప్లేయర్లందరినీ  వదులుకోవాలి..’అని ఫన్నీగా  చెప్పాడు. 

ఏడాదికాలంగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్య ఈ క్యాలెండర్ ఈయర్ లో టీ20 ఫార్మాట్ లో వెయ్యి పరుగులు దాటిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. కివీస్ తో టీ20 సిరీస్ ముగియడంతో సూర్య  న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడనున్నాడు. 

click me!