MS Dhoni Harbhajan Singh
Dhoni-Harbhajan Singh Fight: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని.. తన అంతర్జాతీయ కెరీర్‌లో చాలా మంది యువ ఆటగాళ్లకు అవకాశాలను అందించాడు. వారి కెరీర్‌లో పురోగతి సాధించడంలో సహాయం చేశాడు. అదే సమయంలో ఎందరో గొప్ప క్రికెటర్లతో కలిసి టీమిండియాకు ఎన్నో టైటిళ్లు అందించాడు.
అయితే, ధోనీతో కలిసి ఆడిన చాలా మంది దిగ్గజాలు ఇప్పుడు ధోనీకి దూరంగా ఉన్నారనేది కూడా వాస్తవం. ఇటీవల యువరాజ్ సింగ్ ఒక పోడ్‌కాస్ట్‌లో ధోనీతో తనకు ఎప్పుడూ మంచి స్నేహం లేదని చెప్పగా, ఇప్పుడు మరో వెటరన్ మాజీ క్రికెటర్ చేసిన అలాంటి కామెంట్స్ సంచలనంగా మారింది. అతనే హర్భజన్ సింగ్.
ధోని-హర్భజన్ మధ్య ఏం జరిగింది?
భారత దిగ్గజ ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో తనకున్న సంబంధాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హర్భజన్ ఇటీవల ధోని తన కాల్‌లను స్వీకరించడం లేదనీ, ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని వెల్లడించాడు.
2011 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో భజ్జీ-ధోని కలిసి ఆడారు. భారత్ చారిత్రాత్మక టైటిల్ విజయంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ కప్ మాత్రమే కాదు, వీరిద్దరూ తమ ఆడే సమయాల్లో భారత్‌కు అనేక ముఖ్యమైన విజయాల్లో భాగమయ్యారు. ఇద్దరు కలిసి భారత జట్టుకు అనేక విజయాలు అందించారు.
Dhoni-Harbhajan Singh
ఐపీఎల్ లో కలిసి ఆడిన ధోని-భజ్జీ
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నప్పుడు ధోనీ, హర్భజన్ కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను కూడా పంచుకున్నారు. 2018 నుండి 2020 వరకు ఎంఎస్ ధోని జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నాడు.
ఎంఎస్ ధోనీతో తనకున్న సంబంధం గురించి హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. తమ మధ్య మాటల్లేవ్ అని తేల్చిచెప్పాడు. ఒక న్యూస్ ఛానెల్ తో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ఇకపై ధోనీతో మాట్లాడనని చెప్పడం తో క్రికెట్ వర్గాల్లో మరో కొత్త చర్చ మొదలైంది.
ధోనితో ఎందుకు హర్భజన్ మాట్లాడటం లేదు?
"నేను చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడేటప్పుడు ఇద్దరి మధ్య చర్చలు జరిగేవి.. ఇప్పుడు 10 సంవత్సరాలకు పైగా అవుతోంది. మా మధ్య ఎలాంటి మాటల్లేవ్.. నేను ధోనీతో మాట్లాడను. అతనికి వ్యతిరేకంగా నాకు ఏమీ లేదు. అతను ఏదైనా చెప్పాలనుకుంటే, అతను నాకు చెప్పగలడు. అయితే అతను మాట్లాడినట్లయితే, అతను ఈపాటికి నాకు చెప్పేవాడు.. కానీ కారణం ఏమిటో తెలియదు.. అతను మాట్లాడలేదు" అని హర్భజన్ చెప్పాడు.
హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న సమయంలో ఎంఎస్ ధోని నాయకత్వంలో ఆడగా, సీఎస్కే 2018లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2019లో ధోనీ-హర్భజన్ ఇద్దరూ కలిసి జట్టులో ఉన్నప్పుడు సీఎస్కే రన్నరప్‌గా నిలిచింది. ధోని తాను కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆ చర్చలు కేవలం మైదానానికి మాత్రమే పరిమితమయ్యాయని కూడా భజ్జీ చెప్పాడు.
Dhoni-Harbhajan Singh
"నేను సీఎస్కే CSKలో ఆడుతున్నప్పుడు మేము మాట్లాడుకున్నాము. ఆ తర్వాత మేము మాట్లాడుకోలేదు. దాదాపు 10 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ కావచ్చు. అయితే, దీని ప్రత్యేక కారణం లేదు. అతను మాట్లాడాలనుకుంటే అది చేసేవాడు.. కానీ జరగలేదు.. కారణాలు ఏమిటో నాకు తెలియదు. మేము సీఎస్కే తరఫున ఐపీఎల్ లో ఆడుతున్నప్పుడు మేము మాట్లాడుకునేవాళ్లం.. కానీ, అది గ్రౌండ్‌కే పరిమితమైంది.. అతను నా గదికి రాలేదు.. నేను అతని గదికి వెళ్లలేదు" పేర్కొన్నారు.
తన కాల్స్ తీసుకునే వారికి మాత్రమే తాను కాల్ చేస్తానని చెప్పిన హర్భజన్ సింగ్.. ధోని తన కాల్స్ ను స్వీకరించలేదని చెప్పాడు. అలాగే, ఇకపై ధోనికి టచ్‌లో ఉండననీ, అతడికి ఫోన్ చేయనని చెప్పాడు. "సంబంధాల్లో ఎప్పుడైనా ఇవ్వడం తీసుకోవడం విషయాలు ఉంటాయి... అంటే నేను నిన్ను గౌరవిస్తే, తిరిగి దానిని నేను ఆశిస్తున్నాను.. అయితే, తిరిగి గౌరవిస్తారా లేదా అనేది మీ వద్దనే ఉంటుంది. నేను మీకు ఒకటి లేదా రెండుసార్లు ఫోన్ చేస్తే అన్సర్ చేసే పరిస్థితి లేనప్పుడు.. మళ్లీ ఎలా చేస్తాం.. అంటే నేను మీకు అవసరమైనంత వరకు మాత్రమే" అని హర్భజన్ చెప్పాడు.