రెండ్రోజుల క్రితం అడిలైడ్ వేదికగా ముగిసిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని ఆ జట్టు వికెట్ కీపర్ నురుల్ హసన్ ఆరోపించాడు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. సందట్లో సడేమియాగా పాకిస్తాన్ మాజీలకు ఇదే అస్త్రంగా మారి.. ఐసీసీ బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని అవాకులు చెవాకులు పేలుతున్నారు.
కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ అంశం పై చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) స్పందించింది. ఈ విషయాన్ని మేము వదిలిపెట్టదలుచుకోలేదని.. సరైన వేదికలో ఫిర్యాదు చేస్తామని తెలిపింది.
ఇదే విషయమై బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మెన్ జలాల్ యూనుస్ క్రిక్ బజ్ తో మాట్లాడుతూ.. ‘మేం దీని గురించి మాట్లాడుకున్నాం. మ్యాచ్ లో ఏం జరిగిందో ప్రపంచమంతా చూసింది. వీడియోలు మీ కండ్ల ముందున్నాయి. కోహ్లీ వేసింది ఫేక్ త్రో నే. దాని గురించి మేం అంపైర్లకు ఫిర్యాదు చేసినా వాళ్లు దానిని చూడలేదని రివ్యూకు వెళ్లలేదు.
అంతేగాక మ్యాచ్ మధ్యలో వర్షం పడ్డప్పుడు ఔట్ ఫీల్డ్ తడిగా ఉందని మా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ అంపైర్ ఎరాస్మస్ తో చర్చించాడు. తమకు ఇంకాస్త సేపు సమయం కావాలని కోరాడు. కానీ ఆటలో అంపైర్ల నిర్ణయమే ఫైనల్ కదా. అందుకే అతడు కూడా మ్యాచ్ ను ప్రారంభించడానికి ఓకే చెప్పాడు. అక్కడ అంపైర్లతో వాదులాడానికి ఏమీ లేదు. ఈ విషయాలపై మేము బీసీబీలో చర్చించాం.. సరైన ఫోరమ్ లో ఈ ఇష్యూపై ఫిర్యాదు చేస్తాం..’ అని తెలిపాడు.
మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 185 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ తొలుత అదరగొట్టింది. ఓపెనర్ లిటన్ దాస్ వీరవిహారం చేయడంతో 6 ఓవర్లకే ఆ జట్టు స్కోరు 66 పరుగులు చేసింది. పేసర్లు ధారాళంగా పరుగులివ్వడంతో రోహిత్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కు బంతినిచ్చాడు.
అక్షర్ వేసిన 7వ ఓవర్లో లిటన్ దాస్ కవర్ దిశగా షాట్ ఆడాడు. రెండో పరుగు తీసే క్రమంలో అర్ష్‌దీప్ సింగ్ బాల్ ను వికెట్ కీపర్ వైపుగా విసిరాడు. అదే సమయంలో కోహ్లీ ఇన్ సైడ్ రింగ్ లో ఉన్నాడు. బంతిని అందుకోనప్పటికీ నాన్ స్ట్రైకర్ వైపుగా త్రో విసిరినట్టు యాక్షన్ ఇచ్చాడు. ఈ విషయాన్ని అంపైర్లు గుర్తించలేదని లేకుంటే తమకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు వచ్చేవని తద్వారా విజయం తమదేనని నురుళ్ హసన్ ఆరోపించాడు.