ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీతో దాని గురించే మాట్లాడా.. టీమిండియా ఓపెనర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published | Nov 4, 2022, 11:43 AM IST

T20 World Cup 2022: బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన మ్యాచ్ కు ముందు తాను ఆడిన మూడు మ్యాచ్ లలో కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు.  దీంతో రాహుల్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ఈ  మ్యాచ్ కు ముందు రాహుల్.. విరాట్ తో చర్చించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. 

టీ20  ప్రపంచకప్ లో  తన మీద టీమ్ మేనేజ్మెంట్ తో పాటు అభిమానులు పెట్టుకున్న  అంచనాలను తలకిందులు చేస్తూ కెఎల్ రాహుల్ వరుసగా మూడు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్  స్కోర్లకే వెనుదిరిగాడు.   పాకిస్తాన్ తో  4, నెదర్లాండ్స్ పై 9, సౌతాఫ్రికాపై 9 పరుగులు మాత్రమే చేశాడు. 

దీంతో రాహుల్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని జట్టు నుంచి తొలగించి రిషభ్ పంత్ కు అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. భారత మాజీలు కూడా రాహుల్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తో మ్యాచ్ కెఎల్ రాహుల్ చావో రేవో గా మారింది.  


అయితే ఈ మ్యాచ్ కు ముందు అడిలైడ్ లో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా రాహుల్.. కోహ్లీతో చర్చించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ మెగా టోర్నీలో అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న  కోహ్లీ.. రాహుల్ కు బ్యాటింగ్ టిప్స్ ఇవ్వడం అందులో కనిపించింది. అయితే వాస్తవానికి కోహ్లీ.. రాహుల్ తో ఏం చెప్పాడు..? ఈ ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగింది..? అనేదానిపై తాజాగా ఈ ఓపెనర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

బంగ్లాదేశ్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. ‘వాస్తవంగా చెప్పాలంటే మేం ఆస్ట్రేలియాలో పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. గతంలో మేం ఆసీస్ టూర్ కు వచ్చినప్పుడు ఉన్న  వాతావరణ పరిస్థితుల కంటే ఈసారి భిన్నంగా ఉన్నాయి.  టెస్టు సిరీస్ కోసం మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు చాలా కఠినంగా అనిపిస్తుంది. అదే విషయం మేం మాట్లాడుకున్నాం. 

అంతేగాక  ఇన్నింగ్స్ మిడిల్ లో మనం ఏం చేయగలం..?  నేను కొంత సేపు వికెట్ కాపాడుకోగలిగితే  కోహ్లీతో కలిసి ఏం చేయగలను..? అని  చర్చించాం. అవి మామూలుగా అందరు ప్లేయర్ల మధ్య ఉండేవే. నేను కోహ్లీ మైండ్ సెట్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. 

ఈ టోర్నీలో కోహ్లీ అత్యద్భుత ఫామ్ లో ఉన్నాడు. గడిచిన మూడు మ్యాచ్ లతో పాటు బంగ్లాతో  కూడా రాణించాడు. నేను కూడా కోహ్లీ మైండ్ సెట్ ను ఫాలో అయి రాణించాలని  యత్నించాను.  అంతే.. మేమిద్దరం మాట్లాడుకుంది అదే..’ అని  రాహుల్ తెలిపాడు. 

బంగ్లాదేశ్ తో  అడిలైడ్ వేదికగా ముగిసిన  మ్యాచ్ లో భారత జట్టు  తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్.. 50 పరుగులు చేయగా కోహ్లీ 64 రన్స్ తో మరోసారి చెలరేగాడు. సూర్యకుమార్ యాదవ్ 30 పరుగులతో రాణించాడు.  అనంతరం  బంగ్లాదేశ్.. వర్షం వల్ల మ్యాచ్ ను 16 ఓవర్లకు కుదించగా 5 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమి పాలైంది. 

Latest Videos

click me!