నాకేం సంబంధం లేదు.. అది బీసీసీఐ నిర్ణయం.. హెడ్ కోచ్‌ను తప్పించడంపై హర్మన్‌ప్రీత్ కౌర్ కామెంట్స్

First Published Dec 9, 2022, 3:14 PM IST

భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రమేశ్ పవార్ ను బీసీసీఐ ఇటీవలే తన బాధ్యతల నుంచి తప్పించి  జాతీయ క్రికెట్ అకాడమీకి పంపిన విషయం తెలిసిందే.  
 

టీమిండియా మాజీ క్రికెటర్,   నిన్నామొన్నటి దాకా   భారత మహిళా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేసిన  రమేశ్ పవార్ కు  బీసీసీఐ కొద్దిరోజుల క్రితమే షాకిచ్చింది. అతడిని ఈ పదవి నుంచి తప్పించి  జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కు పంపించింది. ఎన్సీఏలో పవార్.. స్పిన్ కోచ్ గా   సేవలందించనున్నాడు.  

అయితే మహిళల  టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో  బీసీసీఐ.. పవార్ ను మార్చడం తీవ్ర చర్చనీయాంశమైంది.  మిథాలీ రాజ్ ఉన్నప్పుడే ఆమతో విబేధాలున్నాయని  పవార్ పై ఆరోపణలు వచ్చాయి. తాజాగా హర్మన్ ప్రీత్ తో కూడా  పవార్   సమన్వయం సరిగా లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించింది. 
 

భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు  మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో హర్మన్ పాత్రికేయులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె మాట్టాడుతూ.. ‘అలాంటిదేమీ  (కోచ్ తో విబేధాలు) లేదు. నేను  రమేశ్ పవార్ సార్ తో నాకు విబేధాలేమీ లేవు. ఆయనతో పనిచేయడం బాగుండేది.   పవార్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. 

వ్యక్తిగతంగానే గాక జట్టుగా కూడా ఆయన దగ్గర మేం (టీమ్) చాలా నేర్చుకున్నాం.. అయినా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు..? ఎన్సీఏకే కదా. మాకు ఎప్పుడు అవసరమొచ్చినా పవార్ మాకు అందుబాటులో ఉంటాడు. పవార్ ను ఎన్సీఏకు బదిలీచేయడం బీసీసీఐ నిర్ణయం. దానికి మేం కట్టుబడి ఉంటాం’ అని తెలిపింది. 

ఇక మహిళల జట్టుకు  బ్యాటింగ్ కోచ్ గా ఎంపికైన హృషికేష్ కనిత్కర్ గురించి మాట్లాడుతూ.. ‘ఆయన చాలా కూల్ అండ్ కామ్. మా జట్టుకు అలాంటి వ్యక్తి కావాలి. ఒత్తిడి సమయాల్లో దానిని ఎదుర్కునేందుకు  కనిత్కర్ వంటి మార్గదర్శకుల మద్దతు మాకు అవసరముంది.  మేం ఆయనతో గతంలో శ్రీలంక పర్యటనో పనిచేశాం. ఆయన మాకు చాలా  సందేహాలను నివృత్తి చేశాడు. ఇప్పుడు ఇక ఫుల్ టైమ్  బ్యాటింగ్ కోచ్ గా వస్తుండం మాకు చాలా సంతోషంగా ఉంది..’ అని  వివరించింది. 

భారత మహిళల జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న రమేశ్ పవార్ ను ఎన్సీఏకు స్పిన్ బౌలింగ్ కోచ్ గా పంపిన బీసీసీఐ.. కనిత్కర్ కు బ్యాటింగ్ కోచ్ గా బాధ్యతలు అప్పజెప్పింది. ఉమెన్స్ టీమ్ కు  హెడ్ కోచ్ గా ఎవరిని నియమించనున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. 

click me!