అప్పుడు నేను డ్రగ్స్‌కు బానిసయ్యాను.. కానీ ఆమె వల్లే.. వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్

First Published | Oct 30, 2022, 1:43 PM IST

Wasim Akram: స్వింగ్ సుల్తాన్ గా పేరొందిన పాకిస్తాన్ దిగ్గజ  ఆటగాడు వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను కూడా డ్రగ్స్‌కు బాధితుడేనని  షాకింగ్ విషయాలు వెల్లడించాడు. 

పాకిస్తాన్  అందించిన ప్రపంచ దిగ్గజ బౌలర్లలో వసీం అక్రమ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. స్వింగ్ సుల్తాన్ గా గుర్తింపుపొందిన అక్రమ్.. 90వ దశకంలో ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లను  తన  స్వింగ్ బౌలింగ్ తో ముప్పు తిప్పలు పెట్టించాడు. 

తాజాగా అక్రమ్ తన ఆటోబయోగ్రఫీ ‘సుల్తాన్ : ఎ మెమోయిర్’ అనే పుస్తకం విడుదల సందర్భంగా షాకింగ్ విషయాలు వెల్లడించాడు.  ఈ సందర్భంగా అక్రమ్.. తాను కూడా డ్రగ్ అడిక్ట్ అని, చాలాకాలం పాటు కొకైన్ తీసుకున్నానని  చెప్పుకొచ్చాడు. 


బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్రమ్ మాట్లాడుతూ.. ‘దక్షిణాసియాలో సంస్కృతి  విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ  రాత్రి పదింటికి కూడా  ఒకేసారి పది పార్టీలకు వెళ్లొచ్చు.  నాకు డ్రగ్స్ ఇంగ్లాండ్ లో అలవాటు అయ్యాయి.  నా రిటైర్మెంట్ తర్వాత (2003లో) ఒక  పార్టీలోకి వెళ్లినప్పుడు  అక్కడ  డ్రగ్స్ అలవాటు చేసుకున్నాను. 

క్రమంగా అది నన్ను అస్థిరపరిచింది. అది నన్ను మోసగించింది. నేను కూడా కొకైన్ తీసుకునేవాడిని.  నా మొదటి భార్య (హ్యూమా) కు తెలియకుండా నేను ఒంటరిగా కరాచీకి వెళ్లి డ్రగ్స్ తీసుకునేవాడిని.  ఒక్క గ్రామ్ నుంచి రెండు, మూడు దాకా వెళ్లేది. ఏం తినకపోయేవాడిని. నిద్ర ఉండేది కాదు.  క్రమంగా అది నా డయాబెటిస్ కు దారి తీసింది.  మిగతావారి మాదిరిగానే నేనూ  డ్రగ్స్ కు బానిస అయ్యాను. 

కానీ ఒకసారి నా ప్యాంట్ జేబులో  డ్రగ్స్  ప్యాకెట్ ఆమెకు కనబడింది.  అప్పుడు ఆమె నాతో ‘నీకు సాయం కావాలి’ అని చెప్పింది. నేను కూడా అవునన్నాను.  2009లో ఆమె తన చివరిదశలో  నాకు చాలా సాయం చేసింది. డ్రగ్స్ ను నా నుంచి దూరం చేయడానికి ఆమె చేయగలిగినంత చేసింది.  హ్యూమా చనిపోవడంతో  నేను  డ్రగ్స్ ను వదిలేశాను. అప్పట్నుంచి మళ్లీ వాటి జోలికి పోలేదు..’ అని తెలిపాడు. 

అయితే అక్రమ్ చేసిన ఈ కామెంట్స్ పై పాకిస్తాన్  లో సోషల్ మీడియా వేదికగా  అతడిపై ప్రశంసలు కురుస్తుండటం గమనార్హం.  ఇటువంటి విషయాలు చెప్పడానికి చాలా ధైర్యం కావాలని, అక్రమ్ తన జీవితంలో ఎవరికీ తెలియని  విషయాలు అందరినీ కలిచివేశాయని కామెంట్స్ చేస్తున్నారు.

1984 నుంచి 2003 వరకు పాకిస్తాన్ తరఫున ఆడిన అక్రమ్..  104 టెస్టులలో  414 వికెట్లు తీశాడు. 356 వన్డేలలో 502 వికెట్లు పడగొట్టాడు.  పాకిస్తాన్ 1992 లో ప్రపంచకప్ గెలిచిన జట్టులో అక్రమ్ కీలక సభ్యుడు.

Latest Videos

click me!