అర్ష్‌దీప్ అసలు కథెందో మేం అప్పుడే చూశాం : పాక్ దిగ్గజాల ప్రశంసలు

First Published Nov 4, 2022, 4:01 PM IST

T20 World Cup 2022: టీమిండియా యువ పేసర్, తాను ఆడుతున్న తొలి టీ20 ప్రపంచకప్ లోనే   అంచనాలకు మించి రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ పై పాకిస్తాన్ దిగ్గజ బౌలర్లు వసీం అక్రమ్, వకార్ యూనిప్ లు ప్రశంసలు కురిపించారు. 

దేశవాళీలో తానేంటో నిరూపించుకుని ఐపీఎల్ లో మెరిసి తద్వారా జాతీయ జట్టులోకి వచ్చిన పంజాబ్ యువ పేసర్  అర్ష్‌దీప్ సింగ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న  టీ20 ప్రపంచకప్ లో అదరగొడుతున్నాడు.  పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ నుంచి మొన్నటి బంగ్లాదేశ్ మ్యాచ్ వరకూ మెరుగైన ప్రదర్శనలు  చేస్తున్నాడు. 

బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో చివరి ఓవర్లో మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి  సీనియర్ పేసర్లు ఉన్నా రోహిత్ మాత్రం.. అర్ష్‌దీప్ కే బంతినిచ్చాడు. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా అర్ష్‌దీప్.. 14 పరుగులే ఇవ్వడంతో టీమిండియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఈ విజయం తర్వాత   అర్ష్‌దీప్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయభ్ మాలిక్ లు కూడా అతడి ప్రదర్శనలకు ఫిదా అయ్యారు. పాకిస్తాన్ లోని ఏ స్పోర్ట్స్ ఛానెల్ లో జరిగిన టీవీ చర్చలో  ఈ ముగ్గురు అర్ష్‌దీప్ పై ప్రశంసలు కురిపించారు. 

అక్రమ్ మాట్లాడుతూ... ‘నేను, యూనిస్ ఖాన్ కలిసి అర్ష్‌దీప్ ను తొలిసారి ఆసియా కప్ లో చూశాం. అప్పుడే అతడి టాలెంట్ గురించి మాట్లాడుకున్నాం. అతడు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. అర్ష్‌దీప్ కు మంచి భవిష్యత్ ఉంది. అతడు స్వింగ్ తో పాటు యార్కర్లు వేయగలడు, స్లో బంతులూ వేస్తాడు. చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా  బౌలింగ్ చేయగలగడం అతడి ప్రత్యేకత..’ అని చెప్పాడు. 

షోయభ్ మాలిక్ మాట్లాడుతూ.. ‘ఆసియా కప్ లో  భాగంగా సూపర్-6లో పాకిస్తాన్ తో మ్యాచ్ లో అతడు బౌలింగ్ తో పాటు క్యాచ్ కూడా మిస్ చేశాడు. ఆ సందర్భంలో అర్ష్‌దీప్ పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. అంత జరిగినా అతడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.   కొన్నిసార్లు మీ ప్రదర్శన సరిగా లేకపోయినా మిమ్మల్ని మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు అని నిరూపించాడు..’ అని వ్యాఖ్యానించాడు. 

మాలిక్ చెప్పినదానికి కొనసాగింపుగా అక్రమ్.. ‘అవును.. ఆ సయమంలో ఇండియాలో అతడిపై సోషల్ మీడియా వేదికగా దారుణమైన ట్రోలింగ్ జరిగింది.  కానీ అర్ష్‌దీప్ తనపై వచ్చిన ట్రోల్స్ ను తాను పట్టించుకోవడం లేదని చెప్పాడు. ఆటగాళ్లకు ఇటువంటి అటిట్యూడ్ ఉండాలి..’అని తెలిపాడు. 

ఈ టోర్నీలో  అర్ష్‌దీప్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడి 9 వికెట్లు తీశాడు. తాను ఆడిన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ ను డకౌట్ చేసిన అతడు.. తర్వాత మ్యాచ్ లలో కూడా రెచ్చిపోతున్నాడు. భారత్ కు బుమ్రా లేని లోటును తీరుస్తున్నాడు. 

click me!