టీమిండియా కోచ్ ద్రావిడ్ పదవికి హైదరాబాదీ మాజీ క్రికెటర్.. ‘యెస్’ చెప్పిన బీసీసీఐ చీఫ్.. ఎంపిక లాంఛనమే

First Published Nov 14, 2021, 2:34 PM IST

NCA New Head: బెంగళూరులో  ఉన్న జాతీయ క్రికెట్ అకాడమీ.. బీసీసీఐకి, టీమిండియాకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నది. యువ ఆటగాళ్లను సానబెట్టి వారిని భారత జట్టుకు పంపించడంలో ఎన్సీఎ ది కీలక పాత్ర. 

భారత క్రికెట్ జట్టుకు అత్యుత్తమ ఆటగాళ్లను అందించడంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ) ది కీలక పాత్ర. కర్నాటక రాజధాని బెంగళూరులో  ఉన్న ఎన్సీఎ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి, టీమిండియాకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నది.  యువ ఆటగాళ్లను సానబెట్టి.. వారిలో అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీయడంతో పాటు వారిని దేశవాళీ, అండర్-19 టోర్నీలలో ఆడించి..  అట్నుంచి టీమిండియాకు పంపించడంలో ఇన్నాళ్లు దానికి  చీఫ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ కృతకృత్యుడయ్యాడు.

అయితే ఐదేండ్లుగా కోచ్ పదవిలో ఉన్న రవిశాస్త్రి పదవీ కాలం  టీ20 ప్రపంచకప్ తో ముగియడంతో ఆ స్థానాన్ని రాహుల్ ద్రావిడ్ భర్తీ చేస్తున్నాడు. దీంతో ఎన్సీఏ చీఫ్ పదవికి అతడు రాజీనామా చేయాల్సి వచ్చింది. 

ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా..? అని క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడిచింది. పలు పేర్లు తెరపైకి వచ్చినా చివరికి అది భారత మాజీ క్రికెటర్, మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్ ను వరించింది. 

అయితే ఈ పదవికి లక్ష్మణ్ ముందుగా ఒప్పుకోలేదు.  కానీ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ రంగంలోకి దిగి.. వీవీఎస్ ను ఒప్పించాడు. మాజీ క్రికెటర్లు భారత క్రికెట్ కు సేవలందించాలని భావిస్తున్న దాదా.. ఆ క్రమంలో విజయవంతమవుతున్నాడు.

ఎన్సీఏ చీఫ్ పదవిని చేపట్టడానికి లక్ష్మణ్ ఓకే చెప్పినట్టు గంగూలీ తెలిపాడు. దుబాయ్ లో ఉన్న గంగూలీని  పాత్రికేయులు ఇదే విషయం మీద ప్రశ్నిస్తూ..  లక్ష్మణ్ ఆ బాధ్యతలను స్వీకరించనున్నాడా అని అడిగారు. దానికి దాదా.. ‘యెస్’ అని చెప్పడంతో ఎన్సీఎ చీఫ్ గా లక్ష్మణ్ ఎంపిక  లాంఛనమే అని  తేలిపోయింది. 

ఇండియా-ఎ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత లక్ష్మణ్.. ఈ బాధ్యతలను చేపట్టే అవకాశముంది. ప్రస్తుతం లక్ష్మణ్.. సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టుకు మెంటార్ గా ఉన్నాడు. అంతేగాక బెంగాల్ రంజీ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా కూడా సేవలందిస్తున్నాడు. 

ఎన్సీఎ పదవి చేపట్టిన తర్వాత లక్ష్మణ్.. ఈ బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. భారత  క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒకే పదవి కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే అది విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది 

click me!