ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయం కోసం కూడా వేచి ఉండకుండా, ఇషాన్ కిషన్ 4 బంతుల్లో కేవలం 1 పరుగు చేసి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఆసక్తికరంగా, అంపైర్ దీపక్ చాహర్ బంతిని వైడ్ కాల్ చేసే ప్రయత్నంలో ఉండగా, ఇషాన్ కిషన్ క్రీజును వదిలి బయటకు రావడంతో అంపైర్ తికమకపడుతూనే అవుట్ గా ప్రకటించాడు. అయితే, అల్ట్రాఎడ్జ్ ఎటువంటి స్పైక్‌ను చూపించకపోవడంతో వివాదం రేగింది. బ్యాట్ కు బాల్ తాకకుండానే అవుట్ గా క్రీజును వదిలిరావడమేంటని ఇషాన్ కిషన్ పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే భారత జట్టు మాజీ ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇషాన్ కిషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదెక్కడి నిజాయితీ అంటూ ప్రశ్నించాడు. బ్యాట్ కు బాల్ తగలకుండా.. ప్రత్యర్థి జట్లు ఎలాంటి అప్పీలు చేయకుండా.. అంపైర్ ఇంకా అవుట్ ఇవ్వకుండానే క్రీజునుంచి వెళ్లడమేంటని ప్రశ్నించాడు. అంపైర్ తన పనిని చేసేందుకు డబ్బులు తీసుకుంటున్నాడు.. ఆ పనిని కూడా చేయనీకుండా ఇషాన్ కిషన్ అవుట్ అయ్యానంటూ క్రీజు వదిలి రావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అంపైర్ నిర్ణయం తీసుకునే వరకు క్రీజులో ఉండాలనీ, అలాగే, త్వరగా వికెట్లు పడ్డాయి.. డీఆర్ఎస్ తీసుకునే అవకాశాలను కూడా చూడాలని ఎత్తిచూపాడు. రికీ పాంటింగ్ కామెంట్స్ ను కూడా గుర్తు చేశాడు.