No Bilateral Series With Pakistan: జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడిలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత వెంటనే తగిన చర్యలు తీసుకుంటోంది. భారత భద్రతా వర్గాలు వెంటనే ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ మొదలుపెట్టాయి.
పాక్ తీరుపై భారత్ మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే భారత్ పాక్ తో క్రీడా సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. ఇకపై పాకిస్తాన్ తో క్రికెట్ ఆడేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది.
కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. పాకిస్తాన్ తో ఎటువంటి ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడదని టీమిండియా నిర్ణయించుకుందని తెలిపారు. చివరిసారిగా భారత్ - పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ 2012-2013లో జరిగింది. పాకిస్తాన్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడటానికి భారత్ లో పర్యటించింది.
ఇక టీమిండియా చివరిసారిగా 2008లో పాకిస్తాన్ లో పర్యటించింది. అప్పుడు ఆసియా కప్ ఆడారు. రాజకీయ, భౌగోళిక వైరుధ్యాల క్రమంలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ తో ఎలాంటి సిరీస్ లను ఆడటం లేదు. వెనకనుంచి ఉగ్రవాదాన్ని పెంచుతూ పాకిస్తాన్ కాశ్మీర్‌లో శాంతిని నాశనం చేస్తోందనీ, పర్యాటకులు-స్థానికులలో భయాన్ని రేకెత్తిస్తోందని శుక్లా తెలిపారు. అందుకే తాము ఇకపై పాకిస్తాన్ తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ లను ఆడకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు.
IND vs PAK
కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నామనీ, బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. ఐసీసీ నిబంధనల కారణంగా కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ లు ఆడుతుందని తెలిపారు.
అమాయక పర్యాటకులపై జరిగిన దారుణమైన దాడిని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.
"నిన్న పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలను కోల్పోవడం క్రికెట్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధపెట్టింది. BCCI తరపున ఈ భయంకరమైన, పిరికి చర్యను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు మా సంతాపాన్ని తెలుపుతున్నాం. వారి బాధ, దుఃఖాన్ని పంచుకుంటూ, ఈ విషాద సమయంలో మేము చేయి చేయి కలిపి నిలబడతాము" అని సైకియా అన్నారు.
2008 ముంబై ఉగ్రవాద దాడి తర్వాత భారత గడ్డపై జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడి నేపథ్యంలో బుధవారం సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ సందర్భంగా మరణించిన వారి ఆత్మలకు నివాళులర్పించేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో ఒక నిమిషం మౌనం పాటించారు, రెండు జట్ల ఆటగాళ్, అధికారులు సంతాపం తెలుపుతూ నల్లటి బ్యాండ్లు ధరించారు. బాణసంచా కాల్చడం, చీర్లీడర్ల ప్రదర్శనలు, వేడుకలు జరుపుకోలేదు.