మళ్లీ తెరపైకి విరాట్ కెప్టెన్సీ వివాదం! కెప్టెన్‌గా మొదటి ఐసీసీ టోర్నీలోనే ఫైనల్ చేర్చిన కోహ్లీని తప్పించి..

First Published | Nov 20, 2023, 6:09 PM IST

2023 వన్డే వరల్డ్ కప్ పరాభవం, టీమిండియాలో మరోసారి విరాట్ కోహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ ఫ్యాన్ వార్‌కి తెర తీసింది. లీగ్ స్టేజీలో ఇరగదీసిన భారత జట్టు, ఫైనల్ మ్యాచ్‌లో పూర్తిగా చేతులు ఎత్తేసింది..
 

2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్‌గా కొనసాగాలని అనుకున్నాడు. అయితే బీసీసీఐ బలవంతంగా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది..
 

ఎమ్మెస్ ధోనీ నుంచి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్‌గా ఆడిన మొట్టమొదటి ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో భారత జట్టు, అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. 
 


అయితే ఇదే టోర్నీ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తాయి. ఫైనల్‌లో టీమిండియా పేలవ ప్రదర్శనకు ఈ విభేదాలే ప్రధాన కారణం...
 

ఆ తర్వాత2019 వన్డే వరల్డ్ కప్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత జట్టు, సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీస్‌లో భారత జట్టు ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి..
 

Rohit Sharma

సరైన మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ యూనిట్ లేకుండా 2019 వన్డే వరల్డ్ కప్ ఆడింది టీమిండియా. 2023లో శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ రూపంలో భారత జట్టు మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. టాపార్డర్‌లోనూ స్టార్ ప్లేయర్లు ఉన్నారు.
 

ఇదే టీమ్‌ని విరాట్ కోహ్లీకి ఇచ్చి ఉంటే, కచ్ఛితంగా ప్రపంచ కప్ తెచ్చేవాడని అంటున్నారు అతని అభిమానులు. కెప్టెన్‌ని మారిస్తే ఐసీసీ టైటిల్స్ వస్తాయని చెప్పిన బీసీసీఐ, గత రెండు టోర్నీల్లో టీమ్ ఎందుకు విఫలమైందో చెప్పాలంటూ ట్రోల్ చేస్తున్నారు..
 

ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, టీమిండియాకి ఐసీసీ టైటిల్ అందిస్తాడని ఆ సమయంలో సగర్వంగా ప్రకటించాడు అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ. దీంతో చాలా మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, గంగూలీని ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు..

విరాట్ కోహ్లీ, ఈ ప్రపంచ కప్‌లో 765 పరుగులు చేసి,టీమ్‌ని ముందుండి నడిపించడం వల్లే భారత జట్టు వరుసగా 10 విజయాలు అందుకుందని, లేకుంటే 2019లో జరిగిందే రిపీట్ అయ్యేదని అంటున్నారు ఫ్యాన్స్.

టీమిండియా, ఫైనల్‌లో ఆస్ట్రేలియాని ఓడించి..  ప్రపంచ కప్ గెలిచి ఉంటే ఏమయ్యోదో కానీ రిజల్ట్ తేడా కొట్టడంతో ఈ ట్రోల్స్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. 

Latest Videos

click me!