బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి బీభత్సమైన క్రేజ్... ఈ ప్లేయర్ల మధ్య ఫైట్ చూడాలంటూ ఐసీసీ సిఫారసు...

First Published Feb 6, 2023, 4:28 PM IST

టెస్టు క్రికెట్ ఫ్యాన్స్‌కి అసలు సిసలైన బిర్యానీలాంటి సిరీస్ తగిలి చాలా రోజులే అయ్యింది. అప్పుడెప్పుడో గత ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మళ్లీ అలాంటి హోరాహోరీ టెస్టు మ్యాచులు చూసే అదృష్టం దక్కలేదు. అలాంటి సంప్రదాయ ఫార్మాట్ ఫ్యాన్స్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ఉన్న ఆస్ట్రేలియా, రెండో స్థానంలో ఉన్న భారత జట్టు... నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడబోతున్నాయి. ఈ సిరీస్ ఫలితం తేలే సమయానికి ఐసీసీ టాప్ టీమ్‌ మారిపోవచ్చు, అలాగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడే టీమ్స్ కూడా డిసైడ్ అయిపోతాయి... తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూడాల్సిన ఎపిక్ ఫేస్-ఆఫ్స్‌ని ప్రకటించింది ఐసీసీ.. 
 

విరాట్ కోహ్లీ వర్సెస్ నాథన్ లియాన్...

విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు ఉంది. రికార్డు స్థాయిలో ఆసీస్‌పై 7 టెస్టు సెంచరీలు సాధించాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీని టెస్టుల్లో అత్యధిక సార్లు అవుట్ చేసిన రికార్డు నాథన్ లియాన్ పేరిట ఉంది. కోహ్లీని నాథన్ లియాన్ బౌలింగ్‌లో 7 సార్లు అవుట్ అయ్యాడు. కొంత కాలంగా స్పిన్నర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ, నాథన్ లియాన్‌ని ఎలా ఫేస్ చేస్తాడో ఆసక్తికరంగా ఉంటుందని సిఫారసు చేసింది ఐసీసీ...

ఛతేశ్వర్ పూజారా  వర్సెస్ జోష్ హజల్‌వుడ్...

ఛతేశ్వర్ పూజారా‌ క్రీజులో పాతుకుపోతే, అతని వికెట్ తీయడం బౌలర్లకు చాలా కష్టం. దెబ్బలు తగిలినా సరే, క్రీజు కదలకుండా పాతుకుపోతాడు పూజారా. అందుకే జోష్ హజల్‌వుడ్, పూజారాకి బౌలింగ్ చేయలేక చాలాసార్లు ఫ్రస్టేషన్ వ్యక్తం చేశాడు... పూజారాని 6 సార్లు అవుట్ చేసిన జోష్, ఈసారి ఆసీస్ శిబిరంలో ఆ జోష్ నింపుతాడా? అనేది చూడాలంటోంది ఐసీసీ..

రవిచంద్రన్ అశ్విన్ వర్సెస్ డేవిడ్ వార్నర్...

డేవిడ్ వార్నర్‌కి ఇండియాలో మంచి రికార్డు ఉంది. టెస్టుల్లో 19 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు బాదిన వార్నర్, గత నెలలో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. అయితే ఇండియాలో వార్నర్ ఇప్పటిదాకా టెస్టు సెంచరీ చేయలేకపోయాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో 10 సార్లు అవుట్ అయ్యాడు వార్నర్, ఇందులో 5 సార్లు ఇండియాలోనే.. దీంతో వార్నర్‌, అశ్విన్ మధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుందని చెబుతోంది ఐసీసీ...

రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమ్మిన్స్...

రోహిత్ శర్మ టెస్టు యావరేజ్ 46.1 అయితే విదేశాల్లో 33, స్వదేశంలో 73... స్వదేశంలో టెస్టుల్లో తిరుగులేని రికార్డు ఉన్న రోహిత్ శర్మ, తొలిసారి కెప్టెన్‌గా ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ ఆడబోతున్నాడు. ఆసీస్ కెప్టెన్, ఇండియన్ కెప్టెన్ మధ్య మంచి ఫైట్ చూడొచ్చని అంటోంది ఐసీసీ. కమ్మిన్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఇప్పటిదాకా 2 సార్లు అవుట్ అయ్యాడు. అయితే ఇప్పటిదాకా ఇండియాలో ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌ని ఎదుర్కోలేదు రోహిత్...

Steve Smith

రవీంద్ర జడేజా వర్సెస్ స్టీవ్ స్మిత్...

ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 2లో ఉన్న స్టీవ్ స్మిత్, ఇండియాపై 72.58 సగటుతో పరుగులు చేశాడు. ఇండియాతో టెస్టులో 8 సెంచరీలు సాధించిన స్టీవ్ స్మిత్, స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో మాత్రం కాస్త తడబడతాడు. జడేజా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ 4 సార్లు అవుట్ అయ్యాడు. టాప్ క్లాస్ బ్యాటర్, వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్ మధ్య టెస్టు సమరాన్ని మిస్ కావద్దని అంటోంది ఐసీసీ.. 

click me!