టెస్టు సిరీస్ గెలవాలంటే రోహిత్‌తో శుబ్‌మన్ గిల్‌ని ఓపెనింగ్ పంపండి! రాహుల్ వద్దు... - హర్భజన్ సింగ్

First Published Feb 6, 2023, 3:38 PM IST

2021 ఇంగ్లాండ్ టూర్‌లో తొలి టెస్టుకి ముందు వరకూ కెఎల్ రాహుల్, టెస్టు టీమ్‌లో కూడా లేడు. పేలవ ఫామ్‌తో రెండేళ్లుగా టీమ్‌కి దూరమైన కెఎల్ రాహుల్, తొలి టెస్టుకి ముందు మయాంక్ అగర్వాల్ నెట్స్‌లో గాయపడడంతో తుదిజట్టులోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాకి టెస్టు ఓపెనర్‌గా మారిపోయాడు...
 

KL Rahul

రోహిత్ శర్మ గాయపడడంతో సౌతాఫ్రికా టూర్‌లో టెస్టులకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, జోహన్‌బర్గ్‌లో టెస్టుకి కెప్టెన్సీ కూడా చేశాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత టెస్టుల్లో టీమిండియాకి వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు కెఎల్ రాహుల్. రాహుల్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్‌లో రెండు టెస్టులు కూడా నెగ్గింది భారత జట్టు...

మరోవైపు 2020-21 ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టు తర్వాత పృథ్వీ షాని తప్పించి, శుబ్‌మన్ గిల్‌కి అవకాశం ఇచ్చింది టీమిండియా. ఆ సిరీస్‌లో అదరగొట్టి, టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు శుబ్‌మన్ గిల్. బ్రిస్బేన్ టెస్టు విజయంలో శుబ్‌మన్ గిల్ చేసిన 91 పరుగులు ఎంతో అమూల్యమైనవి...
 

ప్రస్తుతం బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, ఈ ఏడాది వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ, టీ20ల్లో ఓ సెంచరీ బాదేశాడు. దీంతో శుబ్‌మన్ గిల్‌ని ఆడించాలా? కెఎల్ రాహుల్‌ని ఆడించాలా? అనేది టీమిండియాకి పెద్ద ప్రశ్నగా మారింది..

శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో శుబ్‌మన్ గిల్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని ప్రయత్నాలు చేస్తోంది భారత జట్టు. అయితే శుబ్‌మన్ గిల్‌ని ఓపెనర్‌గా ఆడించడమే కరెక్ట్ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 22, 23, 10, 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు కెఎల్ రాహుల్. దీంతో రాహుల్‌ని ఓపెనర్‌గా కొనసాగించడం వల్ల టీమిండియాకి ఎలాంటి ఉపయోగం లేదంటున్నాడు భజ్జీ...

‘ఏ ఫార్మాట్ అయినా ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా అవసరం. ఓపెనర్లు సెటిల్ అయితే మిడిల్ ఆర్డర్‌పై ప్రెజర్ తగ్గుతుంది. భారీ స్కోరు చేసేందుకు అవకాశాలు పెరుగుతాయి. నా ఉద్దేశంలో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలవాలంటే శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ కలిసి ఓపెనింగ్ చేయాలి...

శుబ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కెఎల్ రాహుల్ టాప్ ప్లేయర్. అయితే అతను పెద్దగా ఫామ్‌లో లేడు. బంగ్లాతో సిరీస్‌లోనూ ఎలా ఆడాడో చూశాం. గిల్ రికార్డులు బ్రేక్ చేస్తూ సాగుతున్నాడు. అతని రిథమ్ దెబ్బ తినకుండా వాడుకుంటే టీమిండియా సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమేమీ కాదు...

సూర్యకుమార్ యాదవ్‌ త్రీ ఫార్మాట్ ప్లేయర్. శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో సూర్యని ఆడిస్తే మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది. అతను కూడా మంచి ఫామ్‌లో ఉన్న విషయం మరిచిపోకూడదు...’ అంటూ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్..

click me!