బీజీటీ అంటే సచిన్‌కు పూనకాలే.. రిటైరై పదేండ్లు అయినా రికార్డులు చెక్కు చెదరలే..

First Published Feb 6, 2023, 4:26 PM IST

Border Gavaskar Trophy 2023: భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఈనెల 9 నుంచి  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) లో భాగంగా  నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు సమరానికి ఇరు జట్లు సన్నద్దమవుతున్నాయి. 

ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ  సమరానికి  మరో మూడు రోజుల్లో తెరలేవనుంది.  నాగ్‌పూర్ వేదికగా ప్రారంభం కానున్న ఈ ట్రోఫీలో  పరుగుల వరద పారించడానికి ఇరు జట్ల బ్యాటర్లు నెట్స్ లో చెమటోడ్చుతున్నారు. అయితే అసలు ఈ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన వీరులెవరో చూద్దాం. 

గడిచిన పదేండ్లుగా విరాట్ కోహ్లీ  ప్రపంచ క్రికెట్ ను శాసించాడు.  కోహ్లీ అంత కాకున్నా  రోహిత్ కూడా ఆస్ట్రేలియా అంటే రెచ్చిపోతాడు.  మిస్టర్ డిపెండెబుల్ ఛటేశ్వర్ పుజారా కూడా  చాలాకాలంగా ఆసీస్ తో టెస్టులు ఆడుతున్నాడు.  ఆసీస్ నుంచి  ప్రస్తుతం ఉన్న  మేటి బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ కు భారత్ పై మంచి రికార్డు ఉంది. అయితే ఎంతమంది ఉన్నా బీజీటీ లో   అత్యధిక పరుగులు వీరుడిగా ఉన్నది ఇప్పటికీ సచిన్ టెండూల్కరే కావడం గమనార్హం. 

సచిన్.. తన కెరీర్ లో  ఆసీస్ పై  34 టెస్టులు ఆడాడు. 90, 2000 దశకాలలో ఆసీస్ దిగ్గజ బౌలర్లుగా వెలుగొందిన  గ్లెన్ మెక్‌గ్రాత్, బ్రెట్ లీ, జాసన్ గిలెస్పీ, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. ఆస్ట్రేలియాకు భారత్ లోనే గాక  వారి స్వదేశంలో కూడా కొరకరాని కొయ్యగా మారాడు.  

మొత్తంగా  34 టెస్టులలో సచిన్..  3,262 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.  ఈ క్రమంలో సచిన్ సగటు  56.24గా ఉంది.   ఇందులో  9 సెంచరీలు , 16 హాఫ్ సెంచరీలున్నాయి.  బీజీటీలో అత్యధిక సెంచరీలు, హాఫ్ సెంచరీలు  చేసింది కూడా సచినే.  

ఒకరకంగా చెప్పాలంటే సచిన్.. బీజీటీలో ఏకఛత్రాధిపత్యం  చెలాయించాడు.  ఈ ట్రోపీలో అత్యధిక పరుగులు, సెంచరీలు, హాఫ్ సెంచరీలతో పాటు  అత్యధిక ఫోర్లు (391), సిక్సర్లు (25), 150 ప్లస్ స్కోర్లు (6),  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు (5), మ్యాన్ ఆఫ్ ది సిరీస్ (3) లు లిటిల్ మాస్టర్ పేరు మీదే ఉన్నాయి.  1998,  2007, 2010 లలో  జరిగిన సిరీస్ లలో  అత్యధిక పరుగులు చేసింది  సచినే కావడం గమనార్హం.  

సచిన్ తర్వాత  అత్యధిక పరుగులు చేసినవారిలో  ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ ఉన్నాడు.  పాంటింగ్..  29 టెస్టులలో  54.36 సగటుతో  2,555  పరుగుుల చేశాడు.  ఇందులో  8 సెంచరీలు కూడా ఉన్నాయి.  భారత బౌలర్లకు పీడకలలు మిగిల్చిన  పాంటింగ్.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 

ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నది మన హైదరాబాదీ సొగసరి  వీవీఎస్ లక్ష్మణ్.   ఆస్ట్రేలియన్లు వీవీఎస్ (వంగివరపు వెంకటసాయి) పేరు తిరగక వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అని పిలుచుకునేవారట.  2001లో ఆస్ట్రేలియాపై కోల్కతాలో ఈడెన్ గార్డెన్ వేదికగా లక్ష్మణ్  చేసిన డబుల్ సెంచరీ  చరిత్రలో సువర్ణధ్యాయాలతో లిఖితమై ఉంది.   ఆస్ట్రేలియా పై 29 టెస్టులలో అతడు.. 2,434 రన్స్ చేశాడు.  సగటు 49.67 గా ఉంది. ఈ క్రమంలో  వీవీఎస్ ఖాతాలో ఆరు సెంచరీలు కూడా  ఉన్నాయి. 

లక్ష్మణ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్  నిలిచాడు.  ‘ది వాల్’  32 టెస్టులలో  2,143 పరుగులు సాధించాడు.   కోల్కతా టెస్టులో లక్ష్మణ్ తో కలిసి ద్రావిడ్   180 పరుగులు సాధించడం  ఎవరూ మరిచిపోలేనిది.   ఆసీస్ బౌలర్లను ద్రావిడ్ ఎంతలా ఫ్రస్ట్రేట్ చేశాడంటే.. 2008లో ఓ టెస్టులో తొలి పరుగు చేయడానికి ద్రావిడ్  40 బంతులు తీసుకున్నాడు.   డిఫెన్స్ తో  ఆసీస్ బౌలింగ్ ను తుత్తునీయలు చేశాడు. 

వీళ్ల తర్వాత బీజీటీలో మోస్ట్ రన్స్ స్కోరర్ గా ఉన్నది  మైఖేల్ క్లార్క్. ఈ మాజీ సారథి    22 టెస్టులలో  2,049 పరుగులు సాధించాడు.   ఇందులో ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి.  ముఖ్యంగా 2012లో సిడ్నీ టెస్టులో  క్లార్క్.. ట్రిపుల్ సెంచరీ (329 నాటౌట్)  తో చెలరేగిన ఇన్నింగ్స్  ఇప్పటికీ ఓ క్లాసిక్. 

click me!