రవిశాస్త్రి తర్వాత ఒంటరైన విరాట్ కోహ్లీ... గంగూలీ, రాహుల్ ద్రావిడ్‌, బీసీసీఐ రాజకీయాలతో...

First Published Jan 15, 2022, 7:48 PM IST

భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగిసిన తర్వాత భారత జట్టులో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకోవడం దగ్గర్నుంచి టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ ప్రకటించడం దాకా కేవలం ఐదు నెలల్లో భారత జట్టులో చాలా జరిగాయి...

రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నంతకాలం టీమిండియాలో అంతా విరాట్ కోహ్లీ రాజ్యమే. జట్టుకి ఏది మంచిదో, ఏది కాదో విరాట్ కోహ్లీయే నిర్ణయించేవాడు. రవిశాస్త్రి కేవలం నామమాత్రపు కోచ్‌గానే ఉండేవాడని టాక్... 

చాలా సందర్భాల్లో టీమిండియాకి మంచే జరిగింది. టెస్టుల్లో 7వ స్థానంలో ఉన్న భారత జట్టు, ఐదేళ్ల పాటు నెం.1 టీమ్‌గా కొనసాగిందంటే దానికి విరాట్ కోహ్లీ కెప్టెన్సీయే కారణం... 

ఆడిలైడ్‌ టెస్టులో ఘోర పరాజయం తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి, ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ గెలిచి అబ్బురపరిచింది టీమిండియా... విరాట్ లేకపోయినా, జట్టులో అతను నింపిన జోషే ఈ విజయానికి కారణం...

రవిశాస్త్రి కోచింగ్‌లో టీమిండియా ఆటతీరు, ప్రత్యర్థి జట్లకు వణుకుపుట్టించేలా సాగింది. అయితే సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియాలో ఆ ఫైర్ కనిపించలేదు...

లార్డ్స్‌ టెస్టులో కేవలం గంటన్నరలో ఇంగ్లాండ్ వంటి టాప్ క్లాస్ బ్యాటింగ్ టీమ్‌ను, వారిదేశంలోనే ఆలౌట్ చేసింది భారత జట్టు... ఆ మ్యాచ్‌లో టీమిండియా ఆటతీరు, జింకలపై విరుచుకుపడిన పులుల్లా సాగింది...

విరాట్ కోహ్లీ అగ్రెసివ్ కెప్టెన్సీకి, హెడ్ కోచ్ రవిశాస్త్రి దూకుడైన నిర్ణయాలు కూడా కలిసి టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపించేది...

సౌతాఫ్రికా సిరీస్‌లో అలాంటి ఫైర్ టీమిండియాలో కనిపించలేదు. రవిశాస్త్రితో పోలిస్తే రాహుల్ ద్రావిడ్ చాలా మృదు స్వభావి. ఆయన ఆటతీరు కూడా అంతే...

దీంతో విరాట్ కోహ్లీ ఆన్‌ఫీల్డ్ బిహేవియర్‌పై కూడా రాహుల్ ద్రావిడ్ హ్యాపీగా లేడని తెలుస్తోంది. జట్టుకి ఏది మంచిదో, ఏది కాదో తనకి తెలుసుని విరాట్ కోహ్లీ లేఖలో ప్రస్తావించడాన్ని బట్టి, డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు...

అంతేకాకుండా రవి భాయ్ అంటూ మాజీ కోచ్ రవిశాస్త్రి గురించి, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ గురించి లేఖలో ప్రస్తావించిన విరాట్ కోహ్లీ... బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి కానీ, ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ గురించి కానీ ఒక్క వ్యాఖ్యం కూడా రాయలేదు... 

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్‌ని వన్డే కెప్టెన్సీ నుంచి బలవంతంగా తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో మొదలైన వివాదం... టెస్టు కెప్టెన్సీ నుంచి వీడ్కోలు పలికేదాకా సాగిందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

టీమిండియాకి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన విరాట్ కోహ్లీకి మాత్రం భారత క్రికెట్ బోర్డు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

జట్టులో విరాట్ కోహ్లీ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా చేసిన రాజకీయాల కారణంగా టీమిండియా ఓ గొప్ప కెప్టెన్‌ను కోల్పోవాల్సి వచ్చిందంటున్నారు ఆయన అభిమానులు...

మొత్తానికి కేప్‌ టౌన్ టెస్టు గెలిచి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో తెలీదు కానీ... సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ పరాజయం తర్వాత విరాట్ శకానికి తెర పడడం సగటు టీమిండియా అభిమానిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

click me!