ఆ కారణంగానే లేటుగా ఇన్నింగ్స్ డిక్లేర్... ఆ నిర్ణయం వెనక విరాట్ కోహ్లీ మాస్టర్ ప్లాన్...

First Published Aug 16, 2021, 9:19 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా... ఆఖరి రోజు మొదటి సెషన్‌లో భారీ ఆధిక్యం దక్కించుకున్న తర్వాత రెండో సెషన్‌లో బ్యాటింగ్‌కి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం వెనక ఓ మాస్టర్ స్ట్రాటెజీ ఉందట...

209 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన తర్వాత మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా కలిసి 9వ వికెట్‌కి 89 పరుగుల భాగస్వామ్యం భారీ భాగస్వామ్యం నెలకొల్పి... టీమిండియాకి మంచి స్కోరు అందించారు. లంచ్ బ్రేక్‌కి వెళ్లే సమయానికే టీమిండియాకి 271 పరుగుల అద్భుతమైన ఆధిక్యం ఉంది.

దీంతో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానిస్తాడని భావించారు క్రికెట్ విశ్లేషకులు... అయితే భారత సారథి మాత్రం ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేయలేదు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా బుమ్రా, షమీ బ్యాటింగ్‌కి వచ్చారు...

ఈ నిర్ణయంతో ఓటమి భయంతో భారత సారథి విరాట్ కోహ్లీ, డ్రా కోసమే ఆలోచిస్తున్నాడేమో అని అందరూ అనుకున్నారు. అయితే టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఆలోచన మాత్రం వేరేగా ఉంది..

లంచ్ బ్రేక్ తర్వాత టీమిండియా కచ్ఛితంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తుంది... ఇక బౌలింగ్, ఫీల్డింగ్ చేయాల్సిన అవసరం లేదని ఇంగ్లాండ్ జట్టు మొత్తం ఓ నిర్ణయానికి వచ్చేసి ఉంటుంది. అలా రిలాక్స్ అయిన వారిని, స్టేడియంలోకి రప్పించాడు విరాట్ కోహ్లీ...

రెండో సెషన్‌లో కేవలం 9 బంతులు మాత్రమే బ్యాటింగ్ చేసిన మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా... 12 పరుగులు సాధించారు... ఆ వెంటనే వచ్చేయమంటూ, ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ...

దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లకు మెంటల్‌గా సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వకుండా ఓ స్ట్రాటెజీ ప్లే చేశాడు విరాట్ కోహ్లీ... ఈ ఎత్తుగడ బాగానే వర్కవుట్ అయ్యింది కూడా. లంచ్ బ్రేక్ తర్వాత ఫీల్డింగ్‌కి కూడా వచ్చిన ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరూ సెటిల్ అవ్వడానికి సమయం కూడా దొరకకపోవడంతో డకౌట్‌గా వెనుదిరిగారు...

అయితే ఆ ఎత్తుగడ కారణంగా భారత జట్టు మూడు ఓవర్లు కోల్పోవాల్సి వచ్చింది. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు వరుస వికెట్లు కోల్పోయి, ఆఖర్లో ఒకటి, రెండు వికెట్లతో మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తే మాత్రం... మరోసారి విరాట్ కోహ్లీ ట్రోల్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది...

లార్డ్స్ మైదానంలో టీమిండియా ఇప్పటిదాకా 19 టెస్టులు ఆడితే... ఏ భారత కెప్టెన్ కూడా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. లార్డ్స్‌లో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన మొట్టమొదటి భారత సారథిగా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...

click me!