టెస్టుల్లో 9000 పరుగులు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ
ఈ మ్యాచ్ లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో ఫామ్ ను అందుకుంటూ హాఫ్ సెంచరీ బాదాడు. తన 53 పరుగుల ఇన్నింగ్స్ తో తన పేరిట మరో ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఈ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో కోహ్లీ టెస్టులో 9000 పరుగులు పూర్తయ్యాయి. ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి 116వ టెస్టులో 197వ ఇన్నింగ్స్‌లో 9000 టెస్టు పరుగులు పూర్తి చేశాడు.
టెస్టు క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును కలిగి ఉన్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్ 200 టెస్టుల్లో 329 ఇన్నింగ్స్‌ల్లో 15921 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 68 అర్ధ సెంచరీలు, 51 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ రెండో స్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 163 టెస్టుల్లో 284 ఇన్నింగ్స్‌ల్లో 13265 పరుగులు చేశాడు. 125 టెస్టుల్లో 214 ఇన్నింగ్స్‌లలో 10122 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.