
IPL - Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025కి ముందు అన్ని ప్రాఛైజీలలో చాలా మార్పులను చూడవచ్చు. ఇప్పటికే పలు టీమ్ లు జట్లలోని మార్పులను గురించి ప్రస్తావించాయి. అలాగే, ఐపీఎల్ రిటెన్షన్ ఆటగాళ్ల విషయం కూడా ఇప్పుడు క్రికెట్ సర్కిల్ లో హాట్ టాపిక్ అవుతోంది. మొత్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ లో దాదాపు అన్ని జట్లలో కొత్త ప్లేయర్లు, కొత్త కెప్టెన్సీ, కొత్త కోచింగ్ సిబ్బందిని చూసే అవకాశముంది.
ఇదే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) కోసం తన కొత్త కోచింగ్ స్టాఫ్‌ను నియమించింది. భారత మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీ ప్రధాన కోచ్‌గా, వేణుగోపాల్ రావు క్రికెట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. భారత్ తరఫున నాలుగు టెస్టులు, 40 వన్డేలు ఆడిన 47 ఏళ్ల బదానీకి వివిధ క్రికెట్ లీగ్‌లలో కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 2021 నుండి 2023 వరకు అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో ఫీల్డింగ్ కోచ్‌గా, బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు.
లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్)లో అతను జాఫ్నా కింగ్స్‌ను వరుసగా రెండు టైటిల్స్‌కు నడిపించాడు. అలాగే, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ (SA20)లో అతను టైటిల్ గెలుచుకున్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కి బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నారు. ఇటీవల దుబాయ్ క్యాపిటల్స్‌కు ప్రధాన కోచ్‌గా కూడా కొనసాగారు. ఈ టీమ్ ఈ సంవత్సరం ILT20 ఫైనల్‌కు చేరుకుంది. 'ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరడం నాకు గొప్ప గౌరవం, నన్ను విశ్వసించినందుకు జట్టు యజమానులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను' అని బదానీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇక భారత్ తరఫున 16 వన్డేలు ఆడిన వేణుగోపాల్ రావ్ 2009లో ఐపీఎల్ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోసం మూడు ఐపీఎల్ సీజన్‌లను కూడా ఆడాడు. దుబాయ్ క్యాపిటల్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అక్కడ అతను ప్రారంభ సీజన్‌లో మెంటార్‌గా, తరువాత క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
వేణుగోపాల్ రావు మాట్లాడుతూ, 'ఫ్రాంచైజీతో నాకు చాలా కాలంగా అనుబంధం ఉంది. నాకు ఈ పాత్రను అందించడంలో జట్టు యజమానులు చూపిన నమ్మకానికి నేను కృతజ్ఞుడను. తప్పకుండా మా బెస్ట్ ఇస్తాం' అని చెప్పారు.
కాగా, ఐపీఎల్ లో ఇప్పటివరకు టైటిల్ గెలుచుకోని ఢిల్లీ క్యాపిటల్స్ 2021 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచింది. అయితే తర్వాతి మూడు సీజన్లలో మొదటి నాలుగు స్థానాలకు చేరుకోవడానికి చాలా కష్టపడింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రెసిడెంట్, సహ యజమాని కిరణ్ కుమార్.. బదానీ, వేణుగోపాల్ రావులను జట్టులోకి స్వాగతించారు. వారిపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
JSW స్పోర్ట్స్ క్రికెట్ డైరెక్టర్ గా సౌరవ్ గంగూలీ
టీమిండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీని కొత్త క్రికెట్ డైరెక్టర్‌గా JSW స్పోర్ట్స్ నియమించింది. గంగూలీ 2019లో JSW ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌లో సలహాదారుగా చేరాడు. కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేశాడు. అతను ఐపీఎల్, మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు దక్షిణాఫ్రికాలోని SA20లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు కూడా పనిచేశాడు.
రాబోయే ఐపీఎల్ సీజన్ కు ముందు రిషబ్ పంత్ కు బిగ్ షాక్ తగిలిందని సమాచారం. పలు మీడియా నివేదికల ప్రకారం ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్సీని పంత్ కోల్పోనున్నాడు. కెప్టెన్సీని మార్చినప్పటికీ అతను ఫ్రాంచైజీకి కీలక ఆటగాడిగా ఉంటాడని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అతనిని టాప్ రిటెన్షన్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. కెప్టెన్సీ ఒత్తిళ్ల నుంచి అతడికి ఉపశమనం కలిగించడం వల్ల మైదానంలో అతని ప్రదర్శన మెరుగుపడుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ అభిప్రాయపడిందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం లేదనీ, ఫ్రాంచైజీ సారథి పాత్ర కోసం ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్‌ను పరిశీలిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక నివేదించింది. ఇదే సమయంలో అక్షర్ పటేల్ కాకపోతే ఐపీఎల్ మెగా వేలం సమయంలో మరో ప్లేయర్ తో కెప్టెన్సీని భర్తీ చేయవచ్చని చూస్తున్నదని పేర్కొంది.