ఎక్కడ దూకుడుగా ఆడాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడు.. రన్ మెషీన్‌పై రాహుల్ ద్రావిడ్ ప్రశంసలు

First Published Dec 15, 2022, 2:09 PM IST

Virat Kohli: దశాబ్దకాలంగా భారత జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకగా మారిన  టీమిండియా మాజీ సారథి  విరాట్ కోహ్లీ ఇటీవలే వన్డేలలో 44 వ  సెంచరీ పూర్తి  చేసుకున్నాడు. తాజాగా కోహ్లీపై  టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ప్రపంచ క్రికెట్ లో మరీ ముఖ్యంగా  టీ20 క్రికెట్ కు ఆదరణ పెరిగి  ఫ్రాంచైజీ మోడల్ సక్సెస్ అయిన తర్వాత  అందరూ అంటున్న మాట అగ్రెసివ్ అప్రోచ్. టెస్టులతో పాటు  మిగతా ఫార్మాట్లలో ప్రస్తుతం ఇంగ్లాండ్ అనుసరిస్తున్న ఫార్ములా ఇదే. గతంలో  ఆస్ట్రేలియా  దీనిని ఫాలో అయింది. కానీ ఇటీవల కాలంలో కాస్త వెనుకబడింది. 

ఇక భారత జట్టుకు అగ్రెసివ్ ఆట అంటే గుర్తుకువచ్చేది విరాట్ కోహ్లీ. ఒకప్పుడు  ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లను చీల్చి చెండాడిన కోహ్లీ..  గడిచిన రెండు మూడేండ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.  ఒకప్పుడు అవలీలగా సెంచరీలు బాదిన అతడు..  ఈ రెండేండ్లలో అడపాదడపా హాఫ్ సెంచరీలు (ఆసియా కప్  ముందు వరకూ)   కొట్టడం తప్ప  దారుణంగా విఫలమయ్యాడు.  

అయితే ఆసియా కప్ లో అఫ్గాన్ పై సెంచరీ చేసిన కోహ్లీ తర్వాత బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో కూడా సెంచరీ చేసి తన 72వ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు. కానీ టెస్టులలో మాత్రం కోహ్లీ ఇంకా  మునపటి ఫామ్ ను అందుకోలేదు. ఈ నేపథ్యంలో కోహ్లీ గేర్ మార్చాలని, మునపటి ఆట ఆడితే బాగుంటుందని పలువురు సూచిస్తున్న నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ స్పందించాడు.  కోహ్లీకి  దూకుడుగా ఆడటంతో పాటు ఆటను నియంత్రించడం కూడా వచ్చునని  అన్నాడు. 

బంగ్లాతో తొలి టెస్టు  ప్రారంభం సందర్భంగా ద్రావిడ్ మాట్లాడుతూ.. ‘పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లీ  ఇప్పటికీ ప్రమాదకర ఆటగాడే. కోహ్లీ  పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేస్తాడు. టీమ్ కు అవసరమున్నప్పుడు దూకుడుగా ఆడతాడు. టీమ్ కష్టాల్లో ఉంటే  వికెట్లను కాపాడుకుంటూ మ్యాచ్ ను తన నియంత్రణలోకి తెచ్చుకుంటాడు.  

డగౌట్ లో కూర్చుని  కోహ్లీ బ్యాటింగ్ చూడటం బాగుంటుంది. ఇప్పటికీ పరుగుల విషయంలో కోహ్లీ దాహం తీరలేదు.   ప్రతీరోజూ కఠినంగా శ్రమిస్తాడు. నెట్స్ లో కోహ్లీ శిక్షణ చూసి నేను ఆశ్చర్యపోతుంటా. ఏడాదిన్నరగా కోహ్లీని చూస్తున్నా కదా. ఏదైనా అత్యవసరముంటే తప్ప అసలు ఏనాడు కూడా  నెట్ ప్రాక్టీస్ కు రాకుండా లేడు.  రాబోయే తరానికి కోహ్లీ  ఒక రోల్ మోడల్..’ అని కొనియాడాడు. 

బంగ్లాతో చివరి వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ.. టెస్టులలో మాత్రం పేలవ ప్రదర్శన తో వెనుదిరిగాడు. తొలి టెస్టులో  బ్యాటింగ్ కు వచ్చి ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో అయినా  కోహ్లీ రాణించాలని అతడి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2019 తర్వాత  కోహ్లీ మళ్లీ  టెస్టులలో సెంచరీ చేయలేదు. 

click me!