పంత్ లేకపోవడం బాధాకరమే.. కానీ మేం భయపడేది అతడి గురించే : మార్కస్ స్టోయినిస్

First Published Jan 29, 2023, 5:47 PM IST

INDvsAUS Test: భారత్ లో  2004 నుంచి టెస్టు సిరీస్ గెలవని  ఆస్ట్రేలియా ఈసారి దానిని సాధించాలనే పట్టుదలతో ఉంది.   ఈ క్రమంలోనే ఆ  జట్టు భారత్ పర్యటనకు రాకముందు సిడ్నీలో గత మూడు రోజులుగా ట్రైనింగ్ క్యాంప్ కూడా   నిర్వహిస్తున్నది.  

వచ్చే నెలలో  భారత్ - ఆస్ట్రేలియాల మధ్య  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భారత్  తో ఆసీస్ నాలుగు టెస్టులు ఆడనుంది.  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)  కోణంలో టీమిండియాకు ఈ  సిరీస్ చాలా కీలకం.  నాలుగు మ్యాచ్ ల ఈ సిరీస్ లో  భారత్ కనీసం  మూడు మ్యాచ్ లు గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత   సాధిస్తుంది. 

భారత్ లో  2004 నుంచి టెస్టు సిరీస్ గెలవని  ఆస్ట్రేలియా ఈసారి దానిని సాధించాలనే పట్టుదలతో ఉంది.   ఈ క్రమంలోనే ఆ  జట్టు భారత్ పర్యటనకు రాకముందు సిడ్నీలో గత మూడు రోజులుగా ట్రైనింగ్ క్యాంప్ కూడా   నిర్వహిస్తున్నది.   ఫిబ్రవరి 9 నుంచి భారత్ -ఆస్ట్రేలియా మధ్య  తొలి టెస్టు జరుగనున్నది. 

అయితే  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో తమకు  స్పిన్నర్లు, ఇక్కడి స్పిన్ పిచ్ ల కంటే టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ అంటేనే ఆందోళనగా ఉందంటున్నాడు  ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్.  కోహ్లీ వరల్డ్ క్లాస్ బ్యాటర్ అని అతడిని ఎదుర్కోవడమే ఆస్ట్రేలియాకు అతి పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డాడు. 

స్టోయినిస్ మాట్లాడుతూ.. ‘భారత్ లో భారత్ ను ఓడించడం  చాలా కష్టం.   స్వదేశంలో  టీమిండియా చాలా స్ట్రాంగ్ టీమ్.  అదీగాక భారత్ లో ఆడుతున్నారు కాబట్టి వాళ్లు మరింత ప్రమాదకరం.   భారత్ కు చాలా లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంది.  అంతేగాక ఉపఖండంలో అనుకూలించే స్పిన్ పిచ్ లపై వాళ్లను ఎదుర్కోవడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. 

అయితే ఆ సవాళ్లకు మేం కూడా సిద్ధంగా ఉన్నాం.  ఈసారి మా జట్టు కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఆసీస్ టీమ్ లో స్పెషలిస్టు స్పిన్నర్లు కూడా ఉన్నారు. ఈ సిరీస్ కచ్చితంగా రసవత్తరంగా ఉంటుంది. అందులో సందేహమే లేదు..’అని చెప్పాడు.  

ఇక కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘కోహ్లీ వరల్డ్ క్లాస్ బ్యాటర్. అతడు ఇటీవలే మళ్లీ తన మునపటి ఫామ్ ను అందుకున్నాడు.  టెస్టులలో అతడు  బెస్ట్ బ్యాటర్. మా జట్టుకు ఈసారి అతడిని అడ్డుకోవడమే పెద్ద టాస్క్.  అతడి ఫామ్ మాకు ఆందోళన కలిగించేదే.. 

ఈ సిరీస్ లో రిషభ్ పంత్ లేకపోవడం బాధాకరం. 2021లో  భారత్ ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు అతడి ఆటను ఎవరూ మరిచిపోలేరు.  కానీ ఈ సిరీస్ లో పంత్ ను చాలా మిస్ అవుతున్నాం..’అని స్టోయినిస్ చెప్పాడు. నెల రోజుల క్రితం పంత్  రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే.  ప్రస్తుతం పంత్  ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

click me!