Big Bash League: బిగ్ బాష్ లీగ్ లో మెరిసిన ఉన్ముక్త్ చంద్.. సిక్సులు, ఫోర్లతో దూకుడు.. కానీ..!

First Published Jan 20, 2022, 2:58 PM IST

Unmukt Chand in BBL: టీమిండియా మాజీ అండర్-19 క్రికెట్ జట్టు సారథి ఉన్ముక్త్ చంద్.. బిగ్ బాష్ లీగ్ లో మెరిశాడు. బుధవారం  రాత్రి జరిగిన మ్యాచులో అతడు  ఆరోన్ పించ్ తో కలిసి అదరగొట్టాడు. 
 

బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లో ఆడుతున్న తొలి భారతీయ పురుష క్రికెటర్ గా రికార్డులకెక్కిన భారత మాజీ ఆటగాడు ఉన్ముక్త్ చంద్.. బుధవారం రాత్రి సిడ్నీ థండర్స్ తో జరిగిన మ్యాచులో మెరిశాడు. 

బీబీఎల్ లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడుతున్న ఉన్ముక్త్.. 22 బంతుల్లో 29 పరుగులు సాధించాడు. కానీ అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు మాత్రం ఓటమి పాలవ్వడం గమనార్హం.  గత మ్యాచులో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన  అతడు.. సిడ్నీ తో మ్యాచులో మాత్రం రాణించాడు. 

చంద్ ఇన్నింగ్స్ లో రెండు భారీ సిక్సర్లు, ఓ ఫోర్ కూడా ఉన్నాయి.  తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (77), అలెక్స్ హేల్స్ (44) ధాటికి ఆ జట్టు భారీ  స్కోరు సాధించింది. 
 

అనంతరం బ్యాటింగ్ కు దిగిన మెల్బోర్న్.. 63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ  క్రమంలో కెప్టెన్ ఆరోన్ పించ్ కు జతకలిసిన చంద్..   క్రీజులోకి రావడంతోనే సిక్సర్ తో ప్రారంభించాడు. పుల్ షాట్, హుక్ షాట్స్ తో అతడు అభిమానులను అలరించాడు.  ఈ మ్యాచులో  ఆరోన్ పించ్ (82) తో కలిసి అతడు మూడో వికెట్ కు 57 పరుగులు జోడించాడు. 

కాగా లక్ష్య ఛేదనలో మెల్బోర్న్ జట్టు  20 ఓవర్లలో  169 పరుగులే చేసింది. దీంతో ఒక పరుగు తేడాతో సిడ్నీని విజయం వరించింది. చివరి ఓవర్లో మెల్బోర్న్ విజయానికి తొమ్మిది పరుగులు అవసరం ఉండగా..  సిడ్నీ బౌలర్ గురిందర్ సంధు 3 వికెట్లు పడగొట్టి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు.
 

కాగా ఈ మ్యాచ్ అనంతరం ఉన్ముక్త్ చంద్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆడటం ద్వారా నా కల నిజమైంది. ఇక్కడ ఆడుతుండటం వల్ల నాలో ఏదో శక్తి ప్రవేశించినట్టు అనిపించింది. ఎంతో సానుకూల దృక్పథం నాకు వచ్చినట్టు ఉంది. దానిని కొనసాగించాలని కోరుకుంటున్నాను...’ అని ట్వీట్ చేశాడు.

click me!