ICC Test Rankings: మళ్లీ టెస్టులలో నెంబర్ వన్ గా ఆసీస్.. మరింత దిగజారిన టీమిండియా ర్యాంకు

First Published Jan 20, 2022, 2:17 PM IST

ICC Test Rankings: దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి భారత్ ను టెస్టు ర్యాంకులలో మరింత దిగజార్చింది. మరోవైపు స్వదేశంలో ఇంగ్లాండ్ తో ముగిసిన యాషెస్ ను చేజిక్కించుకున్న ఆసీస్.. అగ్రస్థానానికి ఎగబాకింది. 
 

స్వదేశంలో ఇంగ్లాండ్ తో ముగిసిన యాషెస్ సిరీస్ ను 4-0 తో గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు టెస్టులలో తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. గత  కొన్నాళ్లలో నిలకడైన ఆటతీరు లేక  ర్యాంకింగులలో వెనుకబడ్డ ఆ జట్టు తిరిగి మొదటి స్థానానికి చేరుకుంది. 
 

మరోవైపు టీమిండియా  మరో స్థానానికి దిగజారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్  కు అర్హత సాధించే అవకాశాలను నానాటికీ సంక్లిష్టం  చేసుకుంటున్నది. దక్షిణాఫ్రికాతో సిరీస్ ఓడటం భారత్ కు నష్టం చేకూర్చింది. 

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్సులో పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా.. 119 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. యాషెస్ లో ఇంగ్లాండ్ ను భారీ తేడాతో ఓడించడం ఆ జట్టుకు కలిసొచ్చింది.
 

ఆ తర్వాత 117 పాయింట్లతో న్యూజిలాండ్  రెండో స్థానంలో ఉంది. ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ను ఆ జట్టు 1-1తో డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. 

ఇక  దక్షిణాఫ్రికాతో 2-1 తేడాతో సిరీస్ కోల్పోయిన విరాట్  కోహ్లి సారథ్యంలోని టీమిండియా.. 116 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.  ఈ సిరీస్ లో తొలి టెస్టు లో నెగ్గిన భారత్.. తర్వాత  రెండు టెస్టులలో దారుణ పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. 
 

యాషెస్ కోల్పోవడంతో  ఇంగ్లాండ్ కు భంగపాటు తప్పలేదు. తాజా  ర్యాంకింగ్స్ లో ఆ జట్టు.. 101 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. భారత్ తో సిరీస్ నెగ్గడంతో సౌతాఫ్రికా 99 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు సఫారీలు ఆరో స్థానంలో ఉండేవాళ్లు. 

ఇక ఈ జాబితాలో పాకిస్థాన్ (93 పాయింట్లతో ) ఆరో స్థానంలో ఉండగా.. 83 పాయింట్లతో శ్రీలంక ఏడవ స్థానాన్ని ఆక్రమించాయి.  వెస్టిండీస్ (75 పాయింట్లు), బంగ్లాదేశ్ (53), జింబాబ్వే (31) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 
 

click me!