ఉన్ముక్త్ చంద్‌కి అక్కడ కూడా నిరాశే... బిగ్‌బాష్ లీగ్‌లో అవకాశం ఇవ్వడం లేదని...

First Published Jan 11, 2022, 7:11 PM IST

టీమిండియాలో అవకాశం కోసం దాదాపు 8 ఏళ్లు ఎదురుచూసి, నిరాశగా యూఎస్‌కేకి వలసెళ్లి పోయాడు ఉన్ముక్త్ చంద్. 2012లో అండర్-19 వరల్డ్‌ కప్ గెలిచిన ఉన్ముక్త్ చంద్‌కి బిగ్‌బాష్ లీగ్‌లోనూ నిరాశ తప్పడం లేదు..

2012 అండర్‌-19 వరల్డ్‌కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అజేయంగా 111 పరుగులు చేసి, భారత జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అప్పటి కెప్టెన్ ఉన్ముక్త్ చంద్...

ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం ఇయాన్ ఛాపెల్‌తో ప్రశంసలు దక్కించుకున్న ఉన్ముక్త్ చంద్, అండర్-19 వరల్డ్ కప్ విజయం తర్వాత వచ్చిన క్రేజ్‌తో విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనాలతో కలిసి ఓ కూల్‌డ్రింక్ యాడ్‌లో కూడా నటించాడు...

అయితే ఉన్ముక్త్ చంద్‌ కెరీర్‌ అనుకున్నంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు. ఐపీఎల్ 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన ఉన్ముక్త్ చంద్, బ్రెట్‌ లీ బౌలింగ్‌లో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు..

ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లకు మారినా అతనికి అవకాశాలు మాత్రం రాలేదు. దేశవాళీ క్రికెట్‌లోనూ ఢిల్లీ జట్టుకి దూరం కావడం, ఉత్తరాఖండ్‌కి ఆడినా పెద్దగా ఫలితం లేకపోవడంతో గత ఏడాది టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించాడు ఉన్ముక్త్ చంద్...

2021 ఆగస్టులో టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించి, యూఎస్‌కేకి మకాం మార్చిన ఉన్ముక్త్ చంద్... మైనర్ లీగ్ క్రికెట్‌లో పాల్గొన్నాడు. మొదటి మ్యాచ్‌లో మూడు బంతుల తర్వాత డకౌట్ అయ్యాడు...

అయితే ఆ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచి, తన జట్టు సిలికాన్ వ్యాలీ స్ట్రైయికర్స్‌కి టైటిల్ అందించాడు. ఆ తర్వాత బిగ్‌బాష్ లీగ్ అగ్రీమెంట్ కూడా దక్కించుకున్నాడు...

మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరుపున అగ్రీమెంట్ దక్కించుకున్న ఉన్ముక్త్ చంద్, బీబీఎల్‌లో ఆడబోయే మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు...

అయితే బీబీఎల్ 2021-22 సీజన్‌లో ఇప్పటిదాకా ఉన్ముక్త్ చంద్‌కి ఒక్క అవకాశం కూడా రాలేదు. దీనిపై తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు ఈ మాజీ భారత క్రికెటర్...

‘బిగ్‌బాస్ లీగ్‌ను టీవీల్లో చూస్తూ ఎంతో ఎంజాయ్ చేసేవాడిని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ క్రికెటర్లు అందరూ ఇందులో పాల్గొంటారు. ఈ టోర్నీలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా...’ అంటూ బిగ్‌బాష్ లీగ్ అగ్రిమెంట్ పొందినప్పుడు కామెంట్ చేశాడు ఉన్ముక్త్ చంద్...

అయితే అతనికి అవకాశం రాకపోవడంతో నిరాశతో ‘ఇదేదో వెకేషన్‌కి వచ్చినట్టుగా ఉంది... థ్యాంక్స్ మెల్‌బోర్న్...’ అంటూ దండం పెడుతున్న ఎమోజీని జత చేశాడు ఉన్ముక్త్ చంద్...

ఐపీఎల్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్లకు కూడా తుదిజట్టులో అవకాశం దక్కదు. అయినా ఏ మాత్రం నిరాశచెందకుండా ఎదురుచూస్తూ ఉంటారు ఆ క్రికెటర్లు...

క్రిస్ లీన్‌తో పాటు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ వంటి ప్లేయర్లు కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నవారే. అలాంటిది ఉన్ముక్త్ చంద్ ఇలా అసంతృప్తి వ్యక్తం చేయడం అతని మానసిక పరిస్థితిని అద్ధం పడుతోందని అంటున్నారు అభిమానులు...

click me!