IPL 2022: నేడు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక భేటీ..? మెగా వేలం, భారత్ లో నిర్వహణపై స్పష్టత

First Published Jan 11, 2022, 4:02 PM IST

IPL 2022: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐపీఎల్-2022 వేలం ప్రక్రియ, ఈ ఏడాది సీజన్ షెడ్యూల్ ఇతరత్రా విషయాలపై నేడు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక సమావేశంలో పాల్గొననున్నది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పై కొన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు నేడు తెరపడనున్నది.  ఐపీఎల్ వేలం, వచ్చే ఏప్రిల్-మే లలో  నిర్వహించతలపెట్టిన 2022 సీజన్ నిర్వహణ, కొత్త ఫ్రాంచైజీలకు క్లీయరెన్స్ వంటి విషయాలపై నేడు స్పష్టత రానున్నది. 

ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నేడు ముంబైలో కీలక భేటి జరుపనున్నది. దేశంలో కరోనా  మళ్లీ విజృంభిస్తుండటంతో  ఐపీఎల్ ఈ ఏడాది కూడా భారత్ లో జరుగుతుందా..? లేదా..? విదేశాల్లోనే నిర్వహిస్తారా..? అని  క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. 

కొద్దిరోజులుగా ఐపీఎల్ వేలానికి సంబంధించిన ప్రక్రియ  కూడా వరుసగా వాయిదా పడుతూ వస్తున్నది.  డిసెంబర్ చివరి మాసంలోనే దీనిని నిర్వహిస్తారని భావించినా బీసీసీఐ మాత్రం దానిని ఫిబ్రవరి (12, 13 తేదీలలో)కి వాయిదా వేసింది. బెంగళూరులో  దీనిని నిర్వహించేందుకు ప్రణాళికలు  సిద్ధం చేసింది. 

కానీ బెంగళూరు లో కరోనా విజృంభణ,  కొత్త ఆంక్షల  నేపథ్యంలో అక్కడ మెగా వేలం నిర్వహణ కష్టంగానే మారింది.  దీంతో వేదిక మార్పుపైనా ఊహాగానాలు వినిపించాయి. ఇక వచ్చే సీజన్ ఐపీఎల్ ను మహారాష్ట్రలోని నాలుగు వేదికల్లో నిర్వహించనున్నారని  కూడా వార్తలు వినిసిస్తున్నాయి.

కాగా నేడు భేటీ కానున్న ఐపీఎల్ గవర్నింగ్  కౌన్సిల్ ముఖ్యంగా ఈ కింది అంశాలపై చర్చించే అవకాశముంది. 1. ఐపీఎల్ 2022 వేలం,  తేది, వేదిక  2. సీవీసీ (అహ్మాదాబాద్) ఫ్రాంచైజీ వివాదంపై తీర్పు 3.  అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలకు క్లియరెన్స్ 4. ఐపీఎల్ 2022 షెడ్యూల్, వేదికలు 5. ఐపీఎల్ మీడియా రైట్స్ టెండర్ లను ప్రధాన ఎజెండాలో చేర్చారు. 

 ఇదే విషయమై ఐపీఎల్  చైర్మెన్ బ్రిజేష్ పటేల్ ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ... ‘ప్రస్తుతం మా  దృష్టంతా  వచ్చే ఐపీఎల్ ను విజయవంతం చేయాలనే.. గవర్నింగ్ కౌన్సిల్ లో ఇవాళ అన్ని విషయాలు చర్చించి ఫైనల్ చేస్తాం...’ అని తెలిపాడు. 

click me!