పాకిస్తాన్‌కి వెళ్లాలా? వద్దా?... ఆసియా కప్ 2023 నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికే వదిలేసిన బీసీసీఐ...

First Published Oct 14, 2022, 2:31 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ టోర్నీ జరిగినట్టే, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ నిర్వహించబోతున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. దీంతో పాకిస్తాన్‌కి వెళ్లాలా? వద్దా? అనేది బీసీసీఐని తీవ్ర సందిగ్ధంలో పడేసింది...
 

దేశవిభజన తర్వాత 1952 నుంచి దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతూ వచ్చాయి. యుద్ధ సమయాల్లో మినహా ఇస్తే ఏడాదికోసారి భారత జట్టు పాక్‌లో పర్యటించడం, పాకిస్తాన్, ఇండియాకి రావడం జరుగుతూ వచ్చాయి. చివరిసారిగా 2006లో పాక్ పర్యటనకి వెళ్లింది టీమిండియా... ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి...

2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత పాక్‌తో క్రికెట్ ఆడేందుకు భారత జట్టు సుముఖత వ్యక్తం చేయలేదు. 2009లో లంక పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో అప్పటి నుంచి పాక్‌లో పర్యటించేందుకు ఏ జట్టూ ముందు రాలేదు... దాదాపు దశాబ్దం తర్వాత ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు పాక్ పర్యటనకు వెళ్లి, టూర్‌ని విజయవంతంగా ముగించగలిగాయి..

2012-13 సీజన్‌లో పాకిస్తాన్ జట్టు, భారత పర్యటనకి వచ్చింది. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు జరిగాయి. పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ముందు టీమిండియా సాహసం చేయలేదు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితులు కాస్త మెరుగుపడడంతో పాక్‌లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసింది బీసీసీఐ...

ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా ఆడాలా? వద్దా? అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికే వదిలేసింది భారత క్రికెట్ బోర్డు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్ మ్యాచులు జరుగుతున్నాయి..

దీంతో ఆసియా కప్ 2023 టోర్నీలో పాల్గొనడానికి సుముఖంగా ఉన్న బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే దాన్నే ఫాలో అవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత జట్టును పాకిస్తాన్‌కి పంపించడానికి కేంద్రం ఒప్పుకుంటుందా? అనేది అనుమానంగానే మారింది... 

click me!