టాస్‌ల వల్లే మ్యాచులు ఓడిపోయాం... కనీసం అక్కడైనా! రోహిత్ శర్మ కామెంట్...

First Published Sep 9, 2022, 4:47 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన భారత జట్టు, సూపర్ 4 రౌండ్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఫైనల్ కూడా చేరలేకపోయింది. పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, శ్రీలంక జట్టుపై 6 వికెట్ల తేడాతో ఓడింది. ఈ ఓటముల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. 

టాప్ క్లాస్ టీమ్‌గా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్‌లో ఉన్న టీమిండియా... ఈ రెండు మ్యాచుల్లో ఓడిన విధానం సగటు టీమిండియా అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ భువీ, 19వ ఓవర్‌లో పరుగులు నియంత్రించలేకపోవడం, ఈజీ క్యాచులను డ్రాప్ చేయడం... ఇలా భారత జట్టు ఓటమికి ఎన్నో కారణాలు...

rohit sharma

కెప్టెన్‌గా ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచి, ద్వైపాక్షిక సిరీసుల్లో జైత్రయాత్ర సాగిస్తూ వచ్చిన రోహిత్ శర్మకు ఈ పరాజయం... గట్టి ఎదురుదెబ్బే. టీ20 వరల్డ్ కప్ 2022 గెలుస్తాడని అనుకున్న రోహిత్, ఆసియా కప్ 2022 టోర్నీలోనే ఫెయిల్ అవ్వడం తట్టుకోలేకపోతున్నారు అభిమానులు...

rohit sharma

కూల్ అండ్ కామ్‌గా ఎంఎస్ ధోనీ స్టైల్‌లో టీమ్‌ని నడిపిస్తాడని ప్రశంసలు దక్కించుకున్న రోహిత్ శర్మ, ఆసియా కప్ 2022లో చాలాసార్లు టెంపర్ కోల్పోయాడు. ప్లేయర్లపై అసహనం చూపించాడు. అదీకాకుండా బ్యాటుతో ఒక్క హాఫ్ సెంచరీ తప్ప పెద్దగా రాణించలేకపోయాడు...

బ్యాటింగ్ ఆర్డర్‌లో అనవసర ప్రయోగాలు చేయడమే కాకుండా పాక్‌తో మ్యాచ్‌లో మంచి బౌలింగ్ కనబర్చిన యంగ్ బౌలర్ రవి భిష్ణోయ్‌ని తర్వాతి మ్యాచ్‌కి సెలక్ట్ కూడా చేయలేదు. దీపక్ హుడాతో బౌలింగ్ వేయించలేదు... ఇవన్నీ రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు రావడానికి కారణమయ్యాయి.

అయితే రోహిత్ మాత్రం కెప్టెన్సీదేం లేదు, టాస్ ఓడిపోవడం వల్లే మ్యాచులు ఓడిపోయామని ఒక్క మాటతో తేల్చేశాడు. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 71వ అంతర్జాతీయ సెంచరీని అందుకున్న విరాట్ కోహ్లీని సరదాగా ఇంటర్వ్యూ చేశాడు రోహిత్ శర్మ...

విరాట్ కోహ్లీ రాబోయే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీసులను ముగించి టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీని పాజిటివ్ ఇంటెంట్‌తో మొదలెట్టాలని ఆకాంక్షించాడు. దీనికి రోహిత్ శర్మ, ‘అక్కడైనా టాస్‌ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయకపోతే బాగుండు...’ అంటూ కామెంట్ చేశాడు...
 

Image credit: PTI

యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టాస్ గెలిచిన జట్లే, 80 శాతానికి పైగా మ్యాచుల్లో విజయాలు సాధించాయి. అయినా అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీపైనే ఎక్కువ విమర్శలు వచ్చాయి. కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న తర్వాత మ్యాచ్ ఫలితాన్ని కెప్టెన్సీతో పాటు చాలా విషయాలు డిసైడ్ చేస్తాయని రోహిత్‌కి తెలిసి వచ్చిందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

Rohit Sharma

2022 ఆసియా కప్‌లోనూ టాస్ గెలిచిన జట్లే ఎక్కువ మ్యాచుల్లో గెలిచాయి. మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో టాస్ ఓడిపోయాడు. హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌ని ఎలాగోలా గెలిచినా ఆ తర్వాత ఛేదనలో 170+ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది భారత జట్టు... 

click me!