Tilak Varma
IND vs SA - Tilak Varma : అద్భుతమైన ఇన్నింగ్స్.. బ్రిలియంట్ గేమ్. 22 ఏళ్ల భారత బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ సెంచూరియన్‌లో దుమ్మురేపాడు. ప్రోటీస్ జట్టు బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డుల మోత మోగించారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో హైదరాబాద్ యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీ సాధించాడు. 56 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 107 పరుగుల నాటౌట్ గా అద్బుతమైన నాక్ ఆడాడు.
Tilak Varma
తన అంతర్జాతీయ కెరీర్ లో తిలక్ వర్మ తొలి సెంచరీ
ఆతిథ్య జట్టు బౌలర్లను తిలక్ వర్మ చెడుగుడు ఆడుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన మొదటి సెంచరీని పూర్తి చేశాడు. అలాగే, తన అంతర్జాతీయ టీ20 కెరీర్ లో ఇదే తొలి సెంచరీ. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. అంతేకాదు చివరి వరకు ఆడి నాటౌట్‌గా నిలిచాడు. అతడిని అవుట్ చేయడంలో ఏ బౌలర్ కూడా విజయం సాధించలేకపోయాడు. ఈ ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ ఎన్నో రికార్డులను కూడా బద్దలు కొట్టాడు.
ఫోర్లు, సిక్సర్ల తిలక్ వర్మ పరుగుల తుఫాన్
సెంచూరియన్ లో జరిగిన భారత్-సౌతాఫ్రికా మూడో టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు రెండో బంతికే ఖాతా తెరవకుండానే సంజూ శాంసన్ ఔట్ కావడంతో తొలి దెబ్బ తగిలింది. దీని తర్వాత అభిషేక్ శర్మ (50 పరుగులు)కు మద్దతుగా వచ్చిన తిలక్ వర్మ దక్షిణాఫ్రికా బౌలర్లను చిత్తు చేసి సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో టీ20 ఫార్మాట్‌లో, అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి సెంచరీని పూర్తి చేశాడు. అంతేకాదు చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. 56 బంతులు ఎదుర్కొన్న తిలక్ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 107 నాటౌట్‌గా నిలిచాడు.
Tilak Varma
ప్రోటీస్ పై సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ తిలక్ వర్మ
దక్షిణాఫ్రికాపై టీ20 ఇంటర్నేషనల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయ ప్లేయర్ గా తిలక్ వర్మ నిలిచాడు. 22 ఏళ్ల 5 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఇది కాకుండా ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున సెంచరీ చేసిన రెండో అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. 21 ఏళ్ల 279 రోజుల వయసులో ఈ ఘనత సాధించిన యశస్వి జైస్వాల్ నంబర్-1 స్థానంలో ఉన్నాడు.
Tilak Varma
అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో సెంచరీ కొట్టిన తొలి తెలుగు ప్లేయర్
అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో సెంచరీ కొట్టిన తొలి తెలుగు ప్లేయర్ గా కూడా తిలక్ వర్మ నిలిచాడు. అలాగే, టీ20 క్రికెట్ లో భారత్ తరఫున సెంచరీ కొట్టిన తొలి తెలుగు ప్లేయర్ గా ఘనత సాధించాడు. సెంచరీ కొట్టిన తెలుగు యంగెస్ట్ ప్లేయర్ కూడా తిలక్ వర్మనే. మొత్తంగా తిలక్ వర్మ భారత్ తరఫున సెంచరీ కొట్టిన రెండో యంగెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. తిలక్ వర్మకు టీ20 కెరీర్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. తిలక్ వర్మ దక్షిణాఫ్రికాపై T20I సెంచరీ చేసి 2010లో రైనా సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు.