ఘోర అవమానం.. 12 ఏళ్ల త‌ర్వాత టీమిండియా చెత్త రికార్డు

First Published Oct 26, 2024, 8:00 PM IST

India vs New Zealand: పూణే వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో భార‌త ప్లేయ‌ర్ల దారుణంగా విఫ‌లమయ్యారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 113 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది.
 

India vs New Zealand: బెంగళూరులో చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో ఓట‌మిపాలైన త‌ర్వాత కూడా భార‌త జ‌ట్టు త‌న తీరును మార్చుకోలేదు. దీంతో ఇప్పుడు పూణేలో కూడా ఘోరంగా న్యూజిలాండ్ చేతిలో చిత్తు అయింది. మొదట ఫాస్ట్ పిచ్‌పై ఫ్లాప్ షో చూపించిన భార‌త ఆట‌గాళ్లు ఇప్పుడు పూణే స్పిన్ పిచ్‌పై కూడా  విఫలమయ్యారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 113 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది.

ఈ విజ‌యంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ లో కివీస్ 2-0 తిరుగులేని ఆధిక్యంలో సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టు తొలిసారి భారత్‌లో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ  సిరీస్‌లో మూడో, చివరి టెస్టు నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.

69 ఏళ్ల త‌ర్వాత చ‌రిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

న్యూజిలాండ్ జట్టు 1955 నుండి భారత్‌లో పర్యటిస్తోంది, కానీ ఇక్కడ ఎన్నడూ టెస్టు సిరీస్‌ని గెలవలేదు. అయితే ఇప్పుడు గ‌తాన్ని మార్చింది. టామ్ లాథమ్ కెప్టెన్సీలో 69 ఏళ్ల కరువుకు స్వస్తి పలికి న్యూజిలాండ్ యువ జట్టు చరిత్ర సృష్టించింది.

69 ఏళ్ల తర్వాత తొలిసారిగా కివీస్‌ జట్టు భారత్‌పై టెస్టు సిరీస్‌ను భారత్‌లో గెలుచుకుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా న్యూజిలాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

Latest Videos


టాస్ ఓడిన భార‌త్.. ఆ త‌ర్వాత కోలుకోలేక‌పోయింది

పూణే మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడి నుంచి మ్యాచ్‌ మారిపోయింది. ఇప్పటి వరకు ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్లు మాత్రమే టెస్టుల్లో విజయం సాధించాయి. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో న్యూజిలాండ్‌కు 103 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేయడం ద్వారా తన ఆధిక్యాన్ని 358 పరుగులకు పెంచుకుంది. దీంతో 359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భార‌త జట్టు 245 పరుగులకే కుప్పకూలింది.

స్టార్ ప్లేయ‌ర్ల ఫ్లాప్ షో 

359 పరుగుల లక్ష్యం భార‌త్ జ‌ట్టులో ఉన్న పెద్ద స్టార్ల ముందు చిన్న‌ద‌నే చెప్పాలి. కానీ, ఈ టార్గెట్ ముందు భారత బ్యాట్స్‌మెన్ నిస్సహాయంగా కనిపించారు. యశస్వి జైస్వాల్ క్రీజులోకి అడుగుపెట్టిన వెంటనే ఎదురుదాడికి దిగాడు, కానీ వరుసగా వికెట్ల పతనం కారణంగా టీమిండియా కోలుకోలేకపోయింది. యశస్వి 65 బంతుల్లో 77 పరుగులు చేశాడు. 

అయితే, జైస్వాల్ త‌ప్ప మిగ‌తా ప్లేయ‌ర్లు ఎవ‌రూ కూడా పెద్ద ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌లేక‌పోయారు. రోహిత్ శర్మ 8 పరుగుల వద్ద, శుభ్‌మన్ గిల్ 23, విరాట్ కోహ్లీ 17, సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగుల వద్ద ఔటయ్యారు. రిషబ్ పంత్ ఖాతా తెరవలేకపోయాడు. 21 పరుగులతో వాషింగ్టన్ సుందర్ కాసేపు పోరాడాడు. రవిచంద్రన్ అశ్విన్ 18 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా 42 పరుగులు చేసినా అది జట్టు వియానికి సరిపోలేదు. న్యూజిలాండ్ తరఫున మిచెల్ సాంట్నర్ అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీశాడు.

12 ఏళ్ల తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన భార‌త్ 

ఈ సిరీస్ కోల్పోయి భార‌త్ మ‌రో చెత్త రికార్డును న‌మోదుచేసింది. 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. భారత గడ్డపై చివరిసారిగా 2012లో టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 2-1తో విజయం సాధించింది. 2012లో ఆడిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ బౌలర్లు భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల‌కు షాక్ ఇచ్చారు.

అద్భుత బౌలింగ్ తో భార‌త్ జ‌ట్టు ఓడిపోయింది. అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ వైపు నుండి మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇప్పుడు కూడా అదే విధంగా న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తే.. భార‌త ఆట‌గాళ్లు ఈ రెండు విభాగాల్లో విఫ‌లం అయ్యారు. దీంతో భార‌త్ సీరీస్ ను కోల్పోయింది.

click me!