
సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) రిటెన్షన్ ప్లేయర్స్ లిస్టును సిద్ధం చేస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం జట్లు తమ ఆటగాళ్లను నిలుపుకోవడానికి గడువు దగ్గరపడుతోంది. ఏ ఆటగాళ్లను ఉంచుకోవాలి, ఎవరిని వదులుకోవాలి అనే దానిపై జట్టు యాజమాన్యాలు చర్చిస్తున్నాయి. గత సీజన్‌లో ఫైనల్ వరకు వెళ్లి ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సారి మంచి ప్రదర్శన చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
గత సీజన్ లో అద్భుతమైన ఆటతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కు చేరుకుంది. కానీ, కేకేఆర్ చేతిలో ఓటమితో ఐపీఎల్ టైటిల్ ను కోల్పోయింది. దాదాపు జట్టులోని అందరూ ప్లేయర్లు మంచి ప్రదర్శన ఇచ్చారు. రాబోయే సీజన్ లో కూడా ఆ జట్టు టాప్ ప్రదర్శనతో అదరగొట్టాలని చూస్తోంది.
అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కు ముందు ఆటగాళ్ల కోసం మెగా వేలం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్ల రిటెన్షన్ కు సంబంధించిన రూల్స్ ను ఇప్పటికే ప్రకటించింది. అలాగే, రిటెన్షన్ ప్లేయర్ల లిస్టును అందించడానికి అక్టోబర్ నెల చివరి వరకు గడువు విధించింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ ప్లేయర్ల లిస్టును సిద్ధం చేసింది.
ఎస్ఆర్హెచ్ జట్టు ముగ్గురు కీలక ఆటగాళ్లను నిలుపుకుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వీరిలో గత సీజన్ లో అద్భుత ప్రదర్శన చేసిన ప్లేయర్లు ఉన్నారు. వారి వివరాలు గమనిస్తే ఎస్ఆర్హెచ్ జట్టులో నిలుపుకోబోయే ఆటగాళ్ల జాబితాలో మొదట హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు. 23 కోట్ల రూపాయలకు క్లాసెన్‌ను జట్టులో ఉంచుకుంటున్నట్లు సమాచారం.
క్లాసెన్ స్పిన్నర్లను చిత్తుచేస్తూ అద్భుతమైన బ్యాటింగ్ తో రాణిస్తాడు. వికెట్ల ముందు అద్భుతంగా కీపింగ్ చేస్తాడు. అతని బ్యాటింగ్ సామర్థ్యంతో మరింత ప్రసిద్ధి చెందాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో, అలాగే గత ఐపీఎల్ సీజన్‌లో దక్షిణాఫ్రికా తరపున అతని వీరోచిత ప్రదర్శనల తర్వాత అతనికి మరింత డిమాండ్ పెరిగింది.
హెన్రిచ్ క్లాసెన్ తో పాటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ కూడా జట్టులో ఉంటాడు. గత ఐపీఎల్ సీజన్‌లో జట్టును సమర్థవంతంగా నడిపించిన కమిన్స్‌ను 20.75 కోట్ల రూపాయలకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఈ సారి 18 కోట్లకు కమిన్స్‌ను జట్టులో ఉంచుకోవచ్చని తెలుస్తోంది. అతని నాయకత్వంలోనే 2018 తర్వాత మొదటిసారిగా హైదరాబాద్ టీమ్ ఫైనల్స్‌కు చేరుకుంది.
హైదరాబాద్ జట్టులో రిటైన్ చేసుకునే మరో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్. గత సీజన్ లో ట్రావిస్ హెడ్ అద్భుతమైన ధనాధన్ ఇన్నింగ్స్ లతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు సూపర్ విక్టరీలు అందించాడు. తన ఒంటిచేత్తో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లను ఆడాడు. అయితే, అతని రిటెన్షన్ విషయంలో హైదరాబాద్ యాజమాన్యం ఆలోనలు చేస్తోందని సమాచారం.
నితీష్ కుమార్ రెడ్డి విషయంలోనూ ఇదే పరిస్థితి. వీరిద్దరికీ ఎంత చెల్లించాలనే దానిపై ఎస్ఆర్హెచ్ త్వరలోనే ప్రకటన చేయనుంది.హైదరాబాద్ యంగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా నిలుపుకుంటుంది. 21 ఏళ్ల అతను ఐపీఎల్ 2024లో తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో అరంగేట్రం తర్వాత భారత క్రికెట్‌లో వేగంగా తన గుర్తింపును పెంచుకుంటున్న ప్లేయర్ గా మారుతున్నాడు.
వీరితో పాటు యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిలుపుకోనుంది. గత సీజన్ లో అభిషేక్ సూపర్ ఇన్నింగ్స్ లను ఆడాడు. అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ తో కలిసి గత సీజన్ లో అద్భుతమైన ఓపెనింగ్ ఇన్నింగ్స్ లను ఆడాడు. సన్ రైజర్స్ విజయంలో ఈ జోడీ కీలక పాత్ర పోషించింది. కాబట్టి అభిషేక్ వర్మ-ట్రావిస్ హెడ్ లను జట్టుతోనే ఉంచుకోనుంది.
కాగా, ఐపీఎల్ 2024 లో ఫైనల్ కు చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ 2025 ఐపీఎల్‌లో కూడా మంచి ప్రదర్శన చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. దీనికోసం బలమైన ఆటగాళ్లను జట్టు యాజమాన్యం వేలంలో కొనుగోలు చేయనుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా, 2025 సీజన్ కోసం వేలం పర్స్ 120 కోట్లుగా నిర్ణయించారు. వచ్చే నెలలో వేలం జరిగే అవకాశముంది.