జాగ్రత్త.. వాళ్లు మిమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసిస్తారు : ఆసీ‌స్‌కు వెటరన్ స్పిన్నర్ కీలక సూచనలు

First Published Feb 1, 2023, 6:03 PM IST

Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్  ట్రోఫీలో భాగంగా ఈ నెల 9 నుంచి భారత జట్టుతో ఆస్ట్రేలియా  నాలుగు టెస్టులు ఆడనుంది.  ఈ  ప్రతిష్టాత్మక సిరీస్ కోసం కంగారూలు ఇప్పటికే  భారత గడ్డమీద అడుగుపెట్టారు.   బెంగళూరులో   ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొననున్నారు. 

2004 తర్వాత  భారత్ లో టెస్టు సిరీస్ గెలిచేందుకు  నానా తంటాలు పడుతున్న ఆస్ట్రేలియా జట్టు.. ఈసారి ఎలాగైనా సిరీస్ నెగ్గాలని  ఆరాటపడుతున్నది.  అదీగాక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 2019-20,  2020-21 లో  భారత జట్టు ఆస్ట్రేలియాను  వారి స్వంత గడ్డమీదే ఓడించడం కంగారులు పుండుమీద కారం చల్లినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో  ఈసారి  ప్రతీకారం తీసుకోవాల్సిందేనని కంగారూలు భావిస్తున్నారు. 

అయితే భారత్ లో భారత్ ను ఓడించడం అంత ఈజీ కాదని ఇప్పుడున్న ఆస్ట్రేలియా జట్టులోని సీనియర్లకు తెలుసు.  స్వదేశంలో భారత్.. బలవంతమైన జట్టు.  అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో  ఆధిక్యం సాధించి   ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించడంలో భారత ఆటగాళ్లు దిట్ట అని, వాళ్లు (టీమిండియా) మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా హింసిస్తారని  ఆసీస్ జట్టు స్పిన్నర్, 2017 లో భారత్ పర్యటనకు వచ్చిన జట్టులో ఉన్న స్పిన్నర్ స్టీవ్ ఒకెఫీ.. ప్యాట్ కమిన్స్ అండ్ కో. ను హెచ్చరించాడు. 
 

ఈ సిరీస్  ప్రారంభం నేపథ్యంలో  ఒకెఫీ మాట్లాడుతూ.. ‘ఆ టూర్ (2017 ఆసీస్ టీమ్ భారత పర్యటన గురించి) నన్ను  అలిసిపోయేలా చేసింది. వాస్తవానికి నేను ఇది చెప్పకూడదు. రాంచీ టెస్టులో అయితే నేను ఒక ఇన్నింగ్స్ లో 77 ఓవర్లు విసిరా.   టీమిండియా బ్యాటర్లు  మిమ్మల్ని  మానసికంగా, శారీరకంగా  విచ్ఛిన్నం చేస్తారు.    

అంటే వాళ్లేదో భారీ షాట్లు ఆడి మ్యాచ్ ను తమ వైపునకు లాగేసుకుంటారని కాదు.  డిఫెన్స్ ఆడుతూ, సింగిల్స్ తీస్తూ విసుగు తెప్పిస్తారు. ఎంతకూ ఔట్ కారు. మన దగ్గర ఎన్ని ప్రణాళికలు ఉన్నా అవన్నీ అక్కడ పనిచేయవు.  తాఫీగా సింగిల్స్ తీస్తూ  స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ, డిఫెన్స్ నే ఆశ్రయిస్తారు.  

వాళ్లు మ్యాచ్ ను రక్షించుకోవడాని సాలిడ్ గా ఆడతారు.  డిఫెన్స్ లో అయితే వాళ్లు  బుల్లెట్ ప్రూఫ్ కంటే బలంగా ఉన్నారని అనిపిస్తుంది. మన దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నా అవన్నీ వారి ముందు దిగదిడుపే..’అని అన్నాడు. కాగా  రాంచీ టెస్టులో  ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో  450 పరుగులు చేసింది.  భారత్ తొలి ఇన్నింగ్స్ లో 210 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి  603-9 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో  నయా వాల్ ఛటేశ్వర్ పుజారా.. 525 బంతులు ఆడి  202 పరుగులు చేశాడు. 

కాగా 2017తో పోల్చితే ఇప్పుడు  ఆస్ట్రేలియ టీమ్ మరింత  మెరుగ్గా ఉందని, ఈసారి  భారత్ ను ఓడించేందుకు  కమిన్స్ సేన  మెరుగైన ప్రదర్శనలు చేస్తుందని ఆశిస్తున్నట్టు ఒకెఫి చెప్పాడు.  2017 పర్యటనకు వచ్చినప్పుడు ఆడినవారిలో పలువురు ఈ టీమ్ లో ఉన్నారని, వాళ్ల అనుభవం ఈ సిరీస్ లో పనిచేస్తుందని  ఒకెఫీ అభిప్రాయపడ్డాడు.  స్పిన్ ను బాగా ఆడగలిగే స్మిత్, లబూషేన్, కామోరూన్ గ్రీన్ వంటి బలమైన ఆటగాళ్లు ఈసారి ఉన్నారని తెలిపాడు. 
 

click me!