అశ్విన్, భజ్జీ కాదు.. ఐపీఎల్‌లో నేను ఎదుర్కున్న టఫెస్ట్ బౌలర్ అతడే : క్రిస్ గేల్

First Published Feb 1, 2023, 5:19 PM IST

IPL 2023: ఐపీఎల్ చరిత్రలో  ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న  గేల్.. గత సీజన్ నుంచి  ఈ లీగ్ కు దూరంగా ఉన్నాడు. వయసుతో పాటు  ఇతరత్రా కారణాలతో  గేల్ ఐపీఎల్  ఆడటం లేదు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో క్రిస్ గేల్ రికార్డుల గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.  ఈ లీగ్ లో ఇప్పటివరకు 15 సీజన్లు ముగియగా  13  సీజన్లు  గేల్ ఆడాడు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్,  రాయల్ ఛాలెజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు గేల్. 

13 సీజన్లలో ఎంతోమంది దిగ్గజ బౌలర్లను ఎదుర్కుని వారి బౌలింగ్ ను ఊచకోత కోసిన ఈ విండీస్ వీరుడు.. ఐపీఎల్ లో తాను ఎదుర్కున్న  అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్నది వెల్లడించాడు.   గేల్ ను  ఐపీఎల్ లో హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ లు  ఐదు సార్లు  ఔట్ చేశారు.  అయితే వీళ్లిద్దరూ తనను భయపెట్టలేదని గేల్ చెప్పాడు. 

ముంబై ఇండియన్స్  పేసర్, టీమిండియా పేస్ గుర్రం   జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్  ఎదుర్కోవడం చాలా సవాల్ తో కూడుకున్నదని.. అతడి బౌలింగ్ లో ఆడేందుకు  చాలా కష్టపడ్డానని  గేల్  అన్నాడు.  న్యూజిలాండ్ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ తో  మాట్లాడుతూ గేల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.  బుమ్రా వేసే స్లో బంతులను ఎదుర్కోవడానికి తాను చాలా ఇబ్బందులు పడ్డానని  గేల్ అన్నాడు. 

గేల్ మాట్లాడుతూ... ‘ఐపీఎల్ లో  ఆఫ్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, అశ్విన్ ల కంటే నన్ను బాగా ఇబ్బందిపెట్టిన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అతడి బంతులు ఆడటం చాలా కఠినంగా ఉండేది.  మరీ ముఖ్యంగా  బుమ్రా వేసే స్లో బంతులు ఆడటం చాలా కష్టం.   ప్రతీ  స్లో బంతికి వేరియేషన్స్ ఉంటాయి.  ఐపీఎల్ లో నేను ఎదుర్కున్న టఫెస్ట్ బౌలర్ బుమ్రానే..’అని చెప్పాడు. 

ఐపీఎల్ చరిత్రలో  ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న  గేల్.. గత సీజన్ నుంచి  ఈ లీగ్ కు దూరంగా ఉన్నాడు. వయసుతో పాటు  ఇతరత్రా కారణాలతో  గేల్ ఐపీఎల్  ఆడటం లేదు.  అయితే  ఈ లీగ్ లో అత్యధిక పరుగులు సాధించిన  బ్యాటర్లలో  గేల్  ఏడో  స్థానంలో ఉన్నాడు. 

గేల్.. ఐపీఎల్ లో 142 మ్యాచ్ లు ఆడి  141 ఇన్నింగ్స్ లలో  4,965 పరుగులు సాధించాడు.  ఇందులో ఆరు సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (175) తో పాటు అత్యధిక సిక్సర్ల  (357) కూడా గేల్ పేరిటే ఉంది.  అత్యధిక పరుగుల వీరుల్లో విరాట్ కోహ్లీ (6,411), శిఖర్ ధావన్ (6,086), రోహిత్ శర్మ (5,764), డేవిడ్ వార్నర్ (5,668), సురేశ్ రైనా (5,528), డివిలియర్స్ (5,162) లు గేల్ కంటే ముందున్నారు. 

click me!