
Team India : అంతర్జాతీయ క్రికెట్ లో అనేక రికార్డులు సృష్టించడంతో పాటు భారత క్రికెట్ జట్టుకు అనేక విజయాలు అందించిన స్టార్ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అయితే, వీరు క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పుడు గ్రౌండ్ నుంచి పొందాల్సిన పూర్తి గౌరవాన్ని అందుకోలేకపోయారు. సచిన్ టెండూల్కర్ తో పోలిస్తే ఈ విషయంలో వీరు దురదృష్టవంతులైన భారత క్రికెటర్లు అని చెప్పవచ్చు. నిరాశ కలిగించే విషయమేమిటంటే.. అందులో ఎందరో గొప్ప భారత క్రికెటర్లు ఉన్నారు. అలాంటి గొప్ప 5 మంది క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. !
మహేంద్ర సింగ్ ధోని
మహేంద్ర సింగ్ ధోనీ (ఎంస్ ధోని) భారత జట్టుకు ఎన్నో చారిత్రక క్షణాలు అందించాడు. ధోని కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లలో భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. భారత్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ (2007), క్రికెట్ వరల్డ్ కప్ (2011), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2013) టైటిల్‌లను ధోని కెప్టెన్సీలోనే అందుకుంది. ఇది కాకుండా 2009లో తొలిసారిగా భారత్ టెస్టుల్లో నంబర్ వన్‌గా నిలిచింది. కాగా, డిసెంబర్ 2014లో ధోని అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత ధోని 15 ఆగస్టు 2020న వన్డే, టీ20 ఇంటర్నేషనల్ నుండి కూడా రిటైర్ అయ్యాడు. భారత్‌కు అద్భుతమైన క్షణాలు అందించిన ధోనీ తప్పకుండా వీడ్కోలు మ్యాచ్‌కు అర్హుడు, కానీ అతని కోసం అలాంటి ఏర్పాటు చేయలేదు.
వీరేంద్ర సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్ భారత్ తరఫున 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేశాడు, ఇందులో 23 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 319. వీరూ 251 వన్డేల్లో 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలతో 8273 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో వీరూ అత్యుత్తమ స్కోరు 219. ఇది కాకుండా, వీరూ 19 టీ20 మ్యాచ్‌లలో 394 పరుగులు చేశాడు, అందులో 68 పరుగులు అతని అత్యధిక స్కోరు. వీరేంద్ర సెహ్వాగ్ 2015 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు, కానీ అతనికి వీడ్కోలు మ్యాచ్ గౌరవం లభించలేదు.
గౌతమ్ గంభీర్
గౌతమ్ గంభీర్ 2018 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యాడు, కానీ అతనికి వీడ్కోలు మ్యాచ్ గౌరవం లభించలేదు. 2007 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లు, 2011లో శ్రీలంకతో వన్డే ప్రపంచకప్‌లో గౌతమ్ గంభీర్ హీరోగా నిలిచాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్‌లో 58 టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 41.95 సగటుతో 4154 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు ఉన్నాయి. ఇక గంభీర్ 147 వన్డేల్లో 39.68 సగటుతో 5238 పరుగులు చేశాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లో 97 పరుగులతో భారత్ రెండోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. వన్డేల్లో 11 సెంచరీలు సాధించాడు. టీ20 మ్యాచ్‌ల్లోనూ గంభీర్ తనదైన ముద్రవేస్తూ 37 మ్యాచ్‌లలో 7 హాఫ్ సెంచరీల సహాయంతో 932 పరుగులు చేశాడు.
రాహుల్ ద్రవిడ్
భారత దిగ్గజ ప్లేయర్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. 2012లో ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన తర్వాత రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టు, వన్డేల్లో 10,000కు పైగా పరుగులు చేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు ఇద్దరు మాత్రమే. ఒకరు సచిన్ టెండూల్కర్.. రెండో వ్యక్తి ద్రవిడ్. రాహుల్ ద్రవిడ్ టెస్టుల్లో 13,288 పరుగులు చేయగా, ఇందులో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ద్రావిడ్ వన్డేల్లో 10,889 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా ద్రవిడ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 301 ఇన్నింగ్స్‌ల్లో 210 క్యాచ్‌లు అందుకున్నాడు. క్రికెట్ నుంచి రిటైరైన ద్రవిడ్.. కోచింగ్ తో ముందుకు సాగుతూ తనదైన ముద్ర వేస్తున్నాడు. అయితే, ద్రవిడ్ కు వీడ్కోలు మ్యాచ్ గౌరవం దక్కలేదు.
జహీర్ ఖాన్
భారత జట్టు గొప్ప ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ఒకరు. 2017 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు, కానీ అతనికి వీడ్కోలు మ్యాచ్ గౌరవం లభించలేదు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ చాలా కాలం పాటు భారత ఫాస్ట్ బౌలింగ్ అటాక్ పగ్గాలను నిలబెట్టుకున్నాడు. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జహీర్ తన చివరి టెస్టును ఫిబ్రవరి 2014లో న్యూజిలాండ్‌తో ఆడగా, అతని చివరి వన్డే ఆగస్ట్ 2012లో శ్రీలంకతో పల్లికల్‌లో ఆడాడు. భారత్ తరఫున జహీర్ ఖాన్ 92 టెస్టు మ్యాచ్‌ల్లో మొత్తం 311 వికెట్లు తీయగా, జహీర్ 200 వన్డేల్లో మొత్తం 282 వికెట్లు తీశాడు. ఇది కాకుండా 17 టీ20 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున జహీర్ 600కి పైగా వికెట్లు తీసుకున్నాడు.