అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే

First Published | Sep 14, 2024, 6:32 PM IST

top-5 Indian bowlers : అంతర్జాతీయ క్రికెట్ లో భార‌త బ్యాట‌ర్ల‌తో పాటు బౌల‌ర్లు కూడా అద్భుత‌మైన కెరీర్ ను కొన‌సాగిస్తున్నారు. టీమిండియాకు చాలా సంద‌ర్భాల్లో సూప‌ర్ విక్ట‌రీలు అందించారు. అలా అంత‌ర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భార‌త బౌల‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 
 

Anil Kumble, Ravichandran Ashwin,Zaheer Khan

1. అనిల్ కుంబ్లే - 953 వికెట్లు

లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా ఉన్నాడు. 1990లో ఇంగ్లండ్‌పై టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కుంబ్లే, 401 మ్యాచ్‌లలో 30.06 సగటుతో భారత్ తరఫున 953 వికెట్లు పడగొట్టాడు.

బెంగళూరులో జన్మించిన ఈ క్రికెటర్ 132 మ్యాచ్‌లలో 29.65 సగటుతో 619 టెస్ట్ వికెట్లతో తన కెరీర్‌ను ముగించాడు. అతను 35 సార్లు ఐదు వికెట్లు, ఎనిమిది సార్లు 10 వికెట్లు సాధించాడు. కుంబ్లే 1990-2007 మధ్య 269 వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌లు కూడా ఆడాడు. 30.83 సగటుతో 334 వికెట్లు పడగొట్టాడు.

2. రవిచంద్రన్ అశ్విన్ - 744 వికెట్లు

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్. అలాగే, ప్ర‌స్తుతం క్రికెట్ లో కొనసాగుతున్న ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్లలో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్ గా కొన‌సాగుతున్నాడు.  

281 మ్యాచుల్లో 744 వికెట్లు పడగొట్టిన అశ్విన్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. భారత టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్. అశ్విన్ ఇప్పటివరకు 100 టెస్టుల్లో 516 వికెట్లు, వన్డేల్లో 156 వికెట్లు, టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు.


3. హర్భజన్ సింగ్ - 707 వికెట్లు

అన్ని ఫార్మాట్లలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. అద్భుత‌మైన బౌలింగ్ తో భార‌త్ అనేక అద్భుత విజ‌యాలు అందించాడు భ‌జ్జీ. 

ఈ మాజీ ఆఫ్ స్పిన్నర్ 365 మ్యాచ్‌ల్లో 32.59 సగటుతో 707 వికెట్లు తీశాడు. హర్భజన్ 1998లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్‌లో 103 మ్యాచ్‌లలో 417 వికెట్లతో తన కెరీర్‌ను ముగించాడు.  'ది టర్బంటర్' అని ముద్దుగా పిలుచుకునే హర్భజన్ 234 వ‌న్డేల్లో 33.47 సగటుతో 265 వికెట్లు పడగొట్టాడు.

4. కపిల్ దేవ్ - 687 వికెట్లు

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన  నాలుగో బౌల‌ర్ క‌పిల్ దేవ్. మాజీ ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ 1983 ప్రపంచకప్ విజేతగా నిలిచాడు. భార‌త జ‌ట్టు కెప్టెన్ గా అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో క‌ప్ ను అందించాడు. 

మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 356 మ్యాచ్‌ల్లో భారత్ తరఫున 687 వికెట్లు తీశాడు.  ఈ 687 వికెట్లలో 434 వికెట్లు టెస్టు క్రికెట్ లో సాధించాడు. ఇక 253 వికెట్లు వన్డే క్రికెట్‌లో తీసుకున్నాడు. భారతదేశపు గొప్ప ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా, 1983 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ విజయానికి కెప్టెన్ అయిన కపిల్ దేవ్ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. టెస్టుల్లో 5,248 పరుగులు కూడా చేశారు.

5. జహీర్ ఖాన్ – 597 వికెట్లు

జహీర్ ఖాన్ భార‌త‌ ఫాస్ట్ మీడియం లెఫ్టార్మ్ బౌలర్. టెస్ట్ క్రికెట్ లో కపిల్ దేవ్ తర్వాత అత్యంత విజయవంతమైన భారత పేస్ బౌలర్ గా నిలిచాడు. జహీర్ ఖాన్ బరోడా తరఫున ఆడటం ద్వారా తన దేశవాళీ కెరీర్ ను ప్రారంభించాడు. 2011 ప్రపంచకప్ విజేత అయిన జహీర్ ఖాన్ త‌న అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్ లో 597 వికెట్లు తీశాడు.

92 టెస్టు మ్యాచ్ లలో 311 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, 200 వన్డే మ్యాచ్ లలో 282 వికెట్లు పడగొట్టాడు. కేవలం 17 టీ20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన జహీర్ ఖాన్ 17 వికెట్లు పడగొట్టాడు. ప్ర‌స్తుతం జ‌హీర్ ఖాన్ ను ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ త‌న‌ మెంటార్‌గా నియమించుకుంది. అంత‌కుముందు, ముంబై ఇండియన్స్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. 

Latest Videos

click me!