గతేడాది పాక్ చేతిలో ఓడటం టీమిండియాకు పెద్దదెబ్బే.. కానీ వాళ్లు దానిని అంతగా పట్టించుకోరు: పాక్ మాజీ సారథి

First Published Aug 5, 2022, 1:21 PM IST

India vs Pakistan: గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు పాక్ చేతిలో  10 వికెట్ల తేడాతో ఓడింది.  దీంతో టీమిండియా గ్రూప్ స్టేజ్ లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 

ఆసియా కప్ - 2022లో భాగంగా భారత జట్టు.. ఈనెల 28న పాకిస్తాన్ తో తలపడనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో పాకిస్తాన్ దే పైచేయి అయింది. పది వికెట్ల తేడాతో భారత్ ను ఓడించిన పాకిస్తాన్.. రాబోయే మ్యాచ్ లో అదే ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. 
 

మరోవైపు భారత్ కూడా ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలనే భావిస్తున్నది. పాకిస్తాన్ తో పాటు ఆసియా కప్ నూ గెలిచి  తర్వాత టార్గెట్ పొట్టి ప్రపంచకప్ మీద పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది.   

అయితే గతేడాది ఓటమిని భారత్ అంత సీరియస్ గా తీసుకోదని పాకిస్తాన్ మాజీ సారథి  రషీద్ లతీఫ్ అంటున్నాడు. పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత జట్టు తమ లోపాలపై  దృష్టి సారించిందని.. అందుకు ఇటీవల కాలంలో ఆ జట్టు సాధిస్తున్న ఫలితాలే నిదర్శనమని అన్నాడు. వాళ్ల లక్ష్యం ఆసియా కప్ గెలవడమని.. పాక్ చేతిలో ఓటమిని ఆ జట్టు ఎప్పుడో మరిచిపోయిందని తెలిపాడు. 
 

తన యూట్యూబ్ ఛానెల్ ‘కాట్ బిహైండ్’ లో  భాగంగా లతీఫ్ మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్ వారి మైండ్ లో ఉందని నేనైతే అనుకోవడం లేదు. వాళ్లు (టీమిండియా) సిరీస్-సిరీస్ కు లక్ష్యాలు పెట్టుకుని సాగుతున్నారు. ప్రతి సిరీస్ కూ వాళ్ల లక్ష్యం మారుతున్నది. ప్రస్తుతానికి వాళ్ల టార్గెట్ ఆసియా కప్ మీదే ఉన్నది. గతేడాది పాకిస్తాన్ చేతిలో ఓటమి టీమిండియాను బాగా డ్యామేజ్ చేసింది. దాంతో వాళ్లు లోపాలను సరిచేసుకుంటున్నారు. 

మీరెన్ని మ్యాచులు చూసినా, ఆడినా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఉండే  క్రేజ్ వేరు. త్వరలో ఆసియా కప్ లో కూడా ఈ ఇరు జట్ల మధ్య రసవత్తరపోరుకు ఆస్కారం ఉంది. టీమిండియాకు  రెగ్యులర్ ఆటగాళ్లు అందరూ ఆడితే ఆ జట్టే టోర్నీలో ఫేవరైట్.   

యూఏఈలో పరిస్థితులు కూడా వాళ్లకు అనుకూలంగా ఉంటాయి. పాకిస్తాన్  తో మ్యాచ్ లో  వాళ్లు మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తారు.  గడిచిన  20 ఏండ్లుగా ఇరు జట్ల  మధ్య జరుగుతున్న కీలక మ్యాచ్ లలో భారత్  ఆధిపత్యం చెలాయిస్తున్నది. కానీ గత మ్యాచ్ లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కావున భారత్ మళ్లీ పుంజుకుని ఆధిక్యం సాధించేందుకు ప్రయత్నిస్తుంది..’ అని తెలిపాడు. 

ఇక  ఈ మెగా టోర్నీలో గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాక్ లు  ఈ ఈవెంట్ లో కనీసం మూడు సార్లైనా పోటీ పడే అవకాశముంది. గ్రూప్ స్టేజ్ లో ఒకసారి, సూపర్-4 లో ఓసారి.. ఇరు జట్లు ఫైనల్ చేరితే అక్కడ కూడా మరోసారి దాయాదుల పోరును చూసే అవకాశం ఉంటుంది. 

click me!