KL Rahul: వచ్చే దశాబ్దం అతడిదే.. టీమిండియా ప్రస్తుత, భావి సారథిపై సాబా కరీం ప్రశంసలు

First Published Jan 3, 2022, 3:56 PM IST

India Vs South Africa: గతంలో ఫస్ట్ క్లాస్ మ్యాచులలో అనుభవం లేని ఆటగాడికి ఏకంగా ఒక జాతీయ జట్టు కు సారథ్యం అప్పగించడంపై పలువురు పెదవి విరుస్తున్నా.. నాయకుడిగా  కెఎల్ రాహుల్ సక్సెస్ అవుతాడని భారత మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో వెన్ను నొప్పి గాయంతో బాధపడుతున్న టీమిండియా టెస్టు సారథి కెఎల్ రాహుల్ పై భారత మాజీ ఆటగాడు సాబా కరీం ప్రశంసలు కురిపించాడు. అతడి పనితీరే రాహుల్ ను  అత్యున్నత శిఖరాలు అధిరోహించడానికి దోహదపడుతున్నాయంటూ కొనియాడాడు. 

టీమిండియా పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ ఫిట్ గా లేకపోవడంతో కెఎల్ రాహుల్..  సఫారీలతో వన్డే సిరీస్ లో కూడా  రాహులే నాయకుడిగా వ్యవహరించనున్నాడు. ఇప్పుడు తాజాగా విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కూడా సారథిగా అతడికే ఛాన్సు దక్కింది. 

కాగా రాహుల్ ను సారథిగా (తాత్కాలిక) ఎంపిక చేయడంపై సాబా కరీం మాట్లాడుతూ.. ఇది  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీసుకున్న అద్భుతమైన నిర్ణయమని కొనియాడాడు. వచ్చే ఏడాది మాత్రమే కాదని, అతడు చాలా కాలం పాటు భారత జట్టుకు నాయకత్వ వహిస్తాడని అన్నాడు. 

‘అది (కెఎల్ రాహుల్ ను సారథిగా నియమించడం) గొప్ప నిర్ణయం. వచ్చే ఏడాదిలోనే కాదు..  వచ్చే దశాబ్దంలో కూడా  కెఎల్ రాహుల్ ను టీమిండియాకు నాయకత్వ పగ్గాలు చేపట్టడమే కాదు.. సారథిగా ఒక వెలుగు వెలుగుతాడని నాకు నమ్మకముంది. 

తనకు అప్పగించిన పనికి తగిన న్యాయం చేయడంలో  రాహుల్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడు. భారత జట్టుకు అతడు చాలాకాలం పాటు సేవ చేస్తాడు.

రాహుల్ నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఐపీఎల్ లో అతడు పంజాబ్ జట్టును నడిపించిన విధానం అందరికీ తెలిసిందే. పంజాబ్ తరఫున ఆడుతున్నప్పుడు అతడు మంచి నాయకత్వ ప్రవృత్తిని కనబరిచాడు. 

మీరు కెప్టెన్ ను నియమించినప్పుడు అతడి ప్రాథమిక నైపుణ్యంలో మెరుగుదల ఉండేలా మీరు విశ్లేషణ చేయాలి. పంజాబ్ కు సారథిగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని కచ్చితంగా చేసి చూపించాడు. 

నాయకత్వంతో అతడి పనితీరు మరింత మెరుగవుతుందని నేను భావిస్తున్నాను.. ’ అని కరీం తెలిపాడు. పంజాబ్ కు కెప్టెన్ గా ఉంటూనే రాహుల్ బ్యాటి్ంగ్ లో ఇరగదీసిన విషయం తెలిసిందే. వరుసగా రెండు సీజన్ల పాటు ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఇటీవలే ముగిసిన 2021 సీజన్ లో కూడా టాప్-3 స్థానం అతడిదే. 

ఇదిలాఉండగా.. కెఎల్ రాహుల్  కు గతంలో ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో కెప్టెన్ (ఐపీఎల్ మినహాయిస్తే) గా వ్యవహరించిన అనుభవం ఉంది. 2019లో ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ టీమ్‌కి అతడు కెప్టెన్‌గా ఉన్నాడు. కర్నాటక తరఫున ఆడినా ఆ జట్టుకు సారథిగా లేడు.  

కాగా.. ఇప్పుడేమో  టీమిండియాకు పరిమిత ఓవర్ల క్రికెట్ తో పాటు టెస్టులకు కూడా సారథిగా నియమితుడవడం గమనార్హం.ఇదే విషయాన్ని పలువురు నొక్కి చెబుతూ బీసీసీఐ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు.

దీనిని బట్టి చూస్తే కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత భారత జట్టుకు భావి కెప్టెన్ తయారవుతున్నాడనేది క్రికెట్ పండితులు చెబుతున్న మాట. 

click me!