ఇంగ్లాండ్ మళ్లీ అదే తప్పు... యాషెస్ సిరీస్‌ తొలి టెస్టులో జేమ్స్ అండర్సన్‌కి రెస్ట్ ఇస్తూ...

First Published Dec 7, 2021, 12:57 PM IST

ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌లో స్టార్ ప్లేయర్లకు కొదువేం లేదు. బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ వంటి స్టార్లు లేకపోయినా టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో ప్లేఆఫ్స్‌కి చేరగలిగింది ఇంగ్లాండ్. అయితే టెస్టులో ఇంగ్లాండ్ టీమ్ అనుసరిస్తున్న రొటేషన్ పాలసీ, ఆ జట్టుకి ఎప్పుడూ ఇబ్బందులు తెస్తూనే ఉంది...

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కి ప్లేయర్లు ఫిట్‌గా అందుబాటులో ఉండేందుకు వీలుగా, వర్క్‌లోడ్ పడకుండా జాగ్రత్త పడుతూ రొటేషన్ పాలసీని తీసుకొచ్చింది ఇంగ్లాండ్ జట్టు...

ఈ రొటేషన్ పాలసీ కారణంగా భారత్‌లో జరిగిన టూర్‌లో జోస్ బట్లర్, మొయిన్ ఆలీ వంటి ప్లేయర్లకు పూర్తి మ్యాచులు ఆడే అవకాశం రాలేదు...

తాజాగా యాషెస్ సిరీస్‌లోనూ ఇదే ఫార్ములాను అనుసరిస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్. ఆస్ట్రేలియాకి ఘనమైన రికార్డు ఉన్న గబ్బా టెస్టులో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కి విశ్రాంతినిచ్చింది...

బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా జట్టు గత 32 ఏళ్లుగా ఓటమి ఎదుర్కొలేదు. అయితే ఈ ఏడాది జనవరిలో భారత జట్టు, గబ్బాలో ఆసీస్‌ను మట్టికరిపించి, ఆ రికార్డును చెరిపి వేసింది...

తాజాగా బ్రిస్బేన్ టెస్టుకి ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టు 12 మంది ప్లేయర్ల జాబితాలో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సర్ పేరు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

‘జేమ్స్ అండర్సన్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. అతనికి ఎలాంటి గాయం కాలేదు. అయితే వచ్చే ఆరు వారాల్లో ఐదు టెస్టులు ఆడనున్నాం. అందుకే ఆడిలైడ్ టెస్టుకి సిద్ధంగా ఉండేందుకు వీలుగా మొదటి టెస్టు నుంచి అతనికి విశ్రాంతినిచ్చాం...

ఆస్ట్రేలియా టూర్‌లో ఇంగ్లాండ్ జట్టు వద్ద ఉన్న పరిమిత వనరులను సమర్థవంతంగా వాడుకోవాలని భావిస్తోంది. అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకనే జిమ్మీకి విశ్రాంతినిచ్చాం...

ప్రాక్టీస్ సెషన్‌లో అండర్సన్‌ పాల్గొన్నాడు. రోజంతా బౌలింగ్ చేశాడు. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నాడు. అతను జట్టుతోనే ఉంటాడు, అయితే గబ్బా టెస్టులో మాత్రం విశ్రాంతి తీసుకున్నాడు...

2019 గబ్బా టెస్టులో ఉదయం సెషన్‌లో బౌలింగ్ చేస్తూ అండర్సన్ గాయపడిన అనుభవాన్ని మేమింకా మరిచిపోలేదు. అందుకే ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..

జేమ్స్ అండర్సన్ సహచరుడు సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌కి మాత్రం గబ్బా టెస్టులో చోటు దక్కింది. అయితే అండర్సన్ లేకుండా బ్రాడ్ ఏ మేరకు రాణిస్తాడనేది అనుమానాస్పదంగా మారింది...

ఆస్ట్రేలియాలో జేమ్స్ అండర్సన్‌కి మంచి రికార్డు ఉంది.  ఆసీస్ గడ్డపై 35.43 సగటుతో 60 వికెట్లు తీసిన అండర్సన్,  2020 యాషెస్ సిరీస్‌లో 24, అంతకుముందు 2017-18 యాషెస్‌లో 17 వికెట్లు పడగొట్టాడు.

భారత్‌తో టెస్టు సిరీస్‌కి ముందు మెంటల్ హెల్త్ కారణాలతో క్రికెట్ నుంచి నిరవధిక బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన బెన్ స్టోక్స్, యాషెస్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు...

గబ్బా టెస్టుకి ఇంగ్లాండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, హసీమ్ హమీద్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, ఓల్లీ పోప్, ఓల్లీ రాబిన్‌సన్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
 

click me!