MS Dhoni: కెప్టెన్ కూల్ కోపోద్రిక్తుడైన వేళ..! అప్పుడొక్కసారే చూశా : షేన్ వాట్సన్

First Published Apr 23, 2022, 6:31 PM IST

TATA IPL 2022: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని అందరూ కెప్టెన్ కూల్ అంటారు. మ్యాచ్ లో ఎంత ఒత్తిడి ఉన్నా  దానిని పైకి కనిపించనీయడు ధోని. ఒత్తిడిని చిత్తుచేసే ధోని ఒక్కసారి  కోపోద్రిక్తుడైనప్పుడు తాను చూశానని వాట్సన్ ఆసక్తికర విషయాలు చెప్పాడు.

క్రికెట్ లో ఒత్తిడి సహజం. ముఖ్యంగా ఛేదన సమయంలో బ్యాటర్ల తో పాటు ఫీల్డింగ్ చేస్తున్న జట్టు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది.  ఫీల్డింగ్ కెప్టెన్ అయితే  మిగిలిన ఆటగాళ్ల కంటే కాస్త ఎక్కువగానే ఒత్తిడికి గురవుతాడు. ఫ్రస్టేషన్ లో కొన్ని సార్లు అతడేం చేస్తున్నాడన్నది కూడా  వారికి తెలియదు. 

కానీ పై చెప్పుకున్నవాటికీ అతీతుడు మహేంద్ర సింగ్ ధోని.  మ్యాచ్ లో ఎంత ఒత్తిడి ఉన్నా.. కూల్ గా  పని కానిచ్చేస్తాడు.  ఒత్తిడి సైతం చిత్తై పోయే చిరునవ్వుతో  భారత జట్టుకు అనేక మ్యాచులను ఒంటి చేత్తో గెలిపించిన ఘనుడతడు. 

Latest Videos


ఇక హై ఓల్టేజీ మధ్య సాగే టీ20 మ్యాచులలో కూడా ధోని ముఖం నుంచి ఆ ఒత్తిడి మచ్చుకైనా కనిపించదు.  తాను కామ్ గా ఉండటమే గాక ఆటగాళ్లను కూడా  అదే మూడ్ లో ఉండేలా చేయడంలో ధోని ప్రత్యేకతే వేరు. మ్యాచ్ సందర్భంగా ధోని.. తన ఆటగాళ్ల మీద అరిచిన ఘటనలు చాలా తక్కువ. అసలు లేవని చెప్పినా అతిశయోక్తి కాదు. 

అయితే ధోని ఫ్రస్టేషన్ ను తాను చూశానని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, సీఎస్కేలో ధోని సహచరుడు షేన్ వాట్సన్. తన కెరీర్ లో ధోని ఒక్కసారి తీవ్రంగా ఫ్రస్టేట్ అవడాన్ని చూశానని ఆ ఘటనను గుర్తుకు తెచ్చుకున్నాడు. 

వాట్సన్ మాట్లాడుతూ.. ‘మీరు ధోని ఫ్రస్టేట్ అవడం గురించి మాట్లాడమంటే నేనైతే నా కెరీర్ లో ఒక్కసారి అలాంటి ఘటనను చూశాను. అది 2019 ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా.. అప్పుడు ముంబై తో ఫైనల్ మ్యాచ్ జరిగింది. 

అయితే ఆ మ్యాచ్ లో మేం ఓడిపోయాం. ముంబై టైటిల్ నెగ్గింది.  డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చాక ధోని తన కిట్ బ్యాగ్ ను తన్నాడు.  అది కూడా చిన్నగానే. అంతకుమించి ధోని ఫ్రస్ట్రేట్ అవడాన్ని నేనైతే చూడలేదు. అంటే.. అతడికి  ఆట అంటే ఎంతిష్టం లేకుంటే అంతలా రియాక్ట్ అవుతాడు. 

ఎంత ఒత్తిడి ఎదురైనా అతడు మాత్రం కామ్ గా ఉంటాడు. అది ఆటోమేటిక్ గా తన గ్రూప్ (జట్టు) లోని ఇతర సభ్యులకు కూడా అలవడుతుంది.  క్రికెట్ లో అలాంటి ఒత్తిడిని జయించే ఆటగాళ్లు దొరకడం చాలా అరుదు. అందుకే ధోని చాలా గ్రేట్..’ అని ప్రశంసల వర్షం కురిపించాడు. 

click me!