అప్పుడు ధోనీ చేస్తే నోరు మెదపలేదు, ఇప్పుడు పంత్ విషయంలో మాత్రం... ఇర్ఫాన్ పఠాన్ ‘రాజ్యాంగం’ ట్వీట్...

First Published Apr 23, 2022, 6:05 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘నో బాల్’ వివాదంపై రేగిన చిచ్చు... రిషబ్ పంత్‌పై విమర్శల వర్షం కురుసేలా చేసింది. అంపైర్లు నో బాల్‌ ఇవ్వకపోవడంతో డగౌట్‌లో ఉన్న రిషబ్ పంత్, ఆవేశాన్ని ఆపుకోలేక బ్యాటర్లను వచ్చేయాలంటూ సూచించడంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది...

ఆఖరి మూడు బంతుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి 18 పరుగులు కావాల్సిన దశలో నడుము పైకి వచ్చిన ఫుల్ టాస్ బంతిని నో బాల్‌గా ప్రకటించకపోవడంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాడు రిషబ్ పంత్... అంపైర్లను ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశాడు...

ఎందుకు నో బాల్ ఇవ్వడం లేదో తెలుసుకొమ్మంటూ ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేని క్రీజులోకి పంపించాడు రిషబ్ పంత్. ఈ పనులను కోడ్ ఆఫ్ కండక్ట్‌‌గా పరిగణించిన ఐపీఎల్ యాజమాన్యం, అతనికి 100 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది..

Latest Videos


కెప్టెన్ చెప్పాడని క్రీజులోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగిన అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై 100 శాతం జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం కూడా విధించింది. ఇంతటీతో ఆగకుండా రిషబ్ పంత్ చేసిన పనిని తీవ్రంగా విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు మహ్మద్ అజారుద్దీన్, ఆర్పీ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు...

రిషబ్ పంత్ చేసిన పనిపై ఇంతటి వ్యతిరేకత రావడంపై తన స్టైల్‌లో స్పందించాడు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. ‘అందరూ రాజ్యాంగ్యాన్ని ఫాలో అవ్వాలి. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమేనని మళ్లీ మళ్లీ గుర్తుంచుకోవాలి...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి రిషబ్ పంత్‌లో ఓ పసి పిల్లాడి మనసత్వం నడిపిస్తోందని, అలాంటి కుర్రాడు చేసిన పనిని ఇంతలా ట్రోల్ చేస్తున్న జనాలు... ‘మిస్టర్ కూల్’, ఐసీసీ టైటిల్స్ విన్నర్ మాహీ ఇదే తప్పు చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని ఓ నెటిజన్ చేసిన కామెంట్‌ను లైక్ కొట్టాడు ఇర్ఫాన్ పఠాన్..

నేరుగా చెప్పకపోయినా ఈ ట్వీట్ రిషబ్ పంత్‌పై వస్తున్న వ్యతిరేకత గురించేనని క్రికెట్ ఫ్యాన్స్‌కి క్లియర్‌గా అర్థమవుతోంది. 2019 సీజన్‌లో ఎమ్మెస్ ధోనీ ఇదే విధంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నో బాల్ గురించి క్రీజులోకి వచ్చి అంపైర్‌తో గొడవ పడ్డాడు...

అప్పటికే మూడు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన సీనియర్ కెప్టెన్, ఇలా ప్రవర్తించడం... అందర్నీ షాక్‌కి గురి చేసింది. అయితే ఆ మ్యాచ్ తర్వాత ఎమ్మెస్ ధోనీ ప్రవర్తన గురించి కానీ, క్రీజులోకి ఎందుకు వెళ్లారనే విషయం గురించి ఎవ్వరూ ప్రశ్నించలేదు...

మ్యాచ్ అనంతరం ధోనీని ఇంటర్వ్యూ చేసిన భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ కూడా ఇలా ప్రవర్తించడంపై మాహీని ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. ఇప్పుడు రిషబ్ పంత్‌ క్రమశిక్షణ లేకుండా నడుచుకున్నాడని ట్వీట్లు చేస్తున్న భారత సీనియర్లు,మాజీలు ఎవ్వరూ ధోనీ గురించి ఒక్క ట్వీట్ చేసే సాహసం చేయలేకపోయారు...

అప్పుడు మహీ నేరుగా క్రీజులోకి వచ్చి అంపైర్లతో గొడవ పెట్టుకుంటే అతనికి 50 శాతం మ్యాచ్ ఫీజు విధించి సరిపెట్టుకున్న ఐపీఎల్ యాజమాన్యం... ఇప్పుడు పంత్ విషయంలో మాత్రం 100 శాతం కోత వేసింది...

అంతేకాకుండా మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ చేసిన పనిని తప్పుబడుతూ తీవ్రంగా ట్రోల్ చేశారు కామెంటేటర్లు. అప్పుడు ధోనీ విషయంలో అలా, పంత్ విషయంలో ఇలా వ్యవహరించడంపైనే పఠాన్ ఇలా ట్వీట్ చేశాడని అంటున్నారు నెటిజన్లు...

గత ఏడాది కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రిషబ్ పంత్ ఆవేశంతో చేసిన ఓ చిన్న పనిని ఇంతలా ట్రోల్ చేస్తున్న మాజీ క్రికెటర్లు... 14 ఏళ్ల కెప్టెన్సీ అనుభవం ఉన్న ధోనీ... క్రీజు దాటినప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ట్రోల్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...
 

click me!