
Telugu cricketers: భారత్ లో క్రికెట్ ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాలా మంది క్రికెటర్లు కావాలనీ, భారత జట్టు తరఫున ఒక్కసారైనా ఆడాలని కలలు కంటుంటారు.
ఇక భారత క్రికెట్ జట్టులో ఒక్క ఛాన్స్ దక్కాలంటే అషామాషీ కాదు. ఒక్క ఛాన్స్ అంటూ పోటీ పడుతున్న లక్షలాది మందిని అధిగమించాలి. అత్యుత్తమ ప్రతిభ కనబరచాలి. అప్పుడు వారికి జాతీయ జట్టులో చోటుదక్కుతుంది. ఇక రాక రాక అవకాశం దొరికితే టాలెంట్ నిరూపించుకుంటేనే జట్టులో స్థానం పదిలం లేకుంటే అదే చివరి మ్యాచ్ అవుతుంది.
భారత జట్టులో మెరుస్తున్న తెలుగు తేజాలు
సతీష్ రెడ్డి, తిలక్ వర్మ, గొంగడి త్రిష.. ఈ ముగ్గురు యంగ్ క్రికెటర్లు భారతజట్టులో స్టార్లు గా ఎదుగుతున్నారు. ఎంతో కష్టపడి క్రీడలో మెరుగైన నైపుణ్యాలు సాధించి జట్టులో చోటుదక్కించుకున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆపత్కాలంలో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడి జట్టు విజయతీరాలకు చేర్చారు. భవిష్యత్తు స్టార్లుగా గుర్తింపు సాధించాడు. సామాన్య కుటుంబాలనుంచి క్రికెట్ లో సాధన చేసి జట్టులో చోటు దక్కించుకుని దేశం యావత్తు మన్ననలు పొందిన వీరికి అభినందనలు చెబుతూ ప్రోత్సహించాల్సిందే.
సాధారణ కుటుంబ నేపథ్యం
అతి సామాన్య కుటుంబానికి చెందిన త్రిష తండ్రి రామిరెడ్డి ప్రోత్సాహంతో క్రికెట్ శిక్షణ తీసుకుని అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి అద్భుతంగా రాణిస్తోంది. తెలంగాణాలోని భద్రాచలానికి చెందిన త్రిష.. గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ఆటతో స్థిరంగా రాణిస్తోంది. ప్రపంచకప్ కు ముందు జరిగిన ఆసియాకప్ లో 5 మ్యాచ్ లలో 53 సగటుతో 159 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు.
అదే ఫామ్ ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీలో కూడా కొనసాగిస్తున్నారు. గతంలో అండర్-19 ప్రపంచకప్ ఆడిన జట్టులోనూ సభ్యురాలైన త్రిష ఫైనల్లో విలువైన 24 పరుగులు చేసి జట్టును విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు ఇదే అనుభవంతో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
అండర్-19 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ భారత్ చేరడంలో ఓపెనర్ త్రిషది కీలకపాత్ర. ఈ టోర్నీలో టాప్ స్కోరర్ ఈ తెలుగమ్మాయే. 5 మ్యాచ్లు ఆడిన ఈ ఆల్రౌండర్ 230 పరుగులు చేసింది. కీలక సమయంలో భారత్ జట్టును ఆదుకుని పరుగులు రాబట్టింది. బంగ్లాదేశ్ పై (40), శ్రీలంకపై (49)పై ఆడిన ఇన్నింగ్స్ లు అవసరమైన సమయంలో వచ్చినవే.
ఈ మ్యాచ్ లలో మిగిలిన బ్యాటర్లందరూ విఫలమైనా తనదైన ఆటతో జట్టును విజయం వైపు నడిపించింది. ఈ టోర్నీలో త్రిష మరో 68 పరుగులు చేస్తే ఒకే టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన శ్వేత సెహ్రావత్ (297) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తుంది.
నితీష్ రెడ్డి.. భారత క్రికెట్ లో యువకెరటం
కుటుంబ త్యాగాలు, వ్యక్తిగత అంకితభావంతో నితీష్ రెడ్డి భారతదేశం కోసం ఆడాలనే తన కలను సాధించాడు. సాధారణ కుటుంబ నేపథ్యం కలిగిన నితీష్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు, సలహాదారుల మద్దతును అధిగమించి, అతను అద్భుతమైన ప్రదర్శనలతో భారత క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. భారత జట్టు తరఫున ఆడుతూ అద్భుతమైన ఆటతో క్రికెట్ దిగ్గజాల నుండి ప్రశంసలు పొందాడు.
ఆర్థిక కష్టాల నుంచి టెస్టు వీరవిహారం వరకు తెలుగబ్బాయి నితీష్ రెడ్డి ప్రయాణం స్ఫూర్తిదాయకమేమీ కాదు.. అతని కథ అన్ని అసమానతలకు వ్యతిరేకంగా అతని ప్రతిభను విశ్వసించిన కుటుంబ పట్టుదల, మార్గదర్శకత్వం, త్యాగాల ప్రభావాన్ని నొక్కి చెబుతుంది. రెడ్డి అంతర్జాతీయ వేదికపై ప్రకాశిస్తూనే, విమర్శకుల దృష్టిలో గౌరవం చూడాలనే తన తండ్రి కల క్రమంగా సాకారం అవుతోంది.
తిలక్ వర్మ.. హైదరాబాద్ పాతబస్తీ నుంచి అంతర్జాతీయ వేదిక వరకు
తిలక్ వర్మ.. ఇప్పుడు భారతీయ క్రికెట్ లో పెరుతెలియనివారుండరు. అతను 3 ఆగస్టు 2023న వెస్టిండీస్‌తో జరిగిన T20I మ్యాచ్‌లో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే, ఇది అంత సులువుగా జరగలేదు. హైదరాబాద్ లో నివాసముంటున్న ఒక సాధారణ కుటుంబానికి చెందిన తిలక్ వర్మ భారత జట్టులో చోటుసంపాదించడం కోసం చాలానే కష్టపడ్డాడు.
హైదరాబాద్ నగర శివార్లలో పాతబస్తీ బార్కాస్‌లో పేద కుటుంబ నేపథ్యం ఉన్న అతను మొదట్లో చాలానే కష్టపడ్డాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అతను 2020లో అండర్-19 ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. భారత రైజింగ్ స్టార్ గా ఎదుగుతున్నాడు.