మిథాలీరాజ్ ఖాతాలో మరో రికార్డు... ఆస్ట్రేలియాతో మొదటి వన్డేలో హాఫ్ సెంచరీతో ఆదుకున్నా...

First Published Sep 21, 2021, 4:20 PM IST

38 ఏళ్ల వయసులో కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతూ, పురుష క్రికెటర్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది మిథాలీరాజ్.... సుదీర్ఘ కెరీర్ కొనసాగించడమే కాదు, టీమిండియా తరుపున సోలో పర్ఫామెన్స్ ఇస్తూ, రికార్డులు క్రియేట్ చేసుకుంటూ సాగుతోంది ‘లేడీ సచిన్’ మిథాలీరాజ్...

ఆస్ట్రేలియా టూర్‌లో మొదటి వన్డేలో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా మహిళా జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్స్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. 

భారీ అంచనాలు పెట్టుకున్న ఓపెనరలు షెఫాలీ వర్మ 8, స్మృతి మంధాన 16 పరుగులు చేసి నిరాశపరిచారు. 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో యషికా భాటియాతో కలిసి మూడో వికెట్‌కి 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది మిథాలీరాజ్...

51 బంతుల్లో 2 ఫోర్లతో 35 పరుగులు చేసిన యషికా అవుట్ అయిన తర్వాత 107 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేసి పెవిలియన్ చేరింది మిథాలీ. ఈ ఇన్నింగ్స్‌తో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ఖాతాలో మరో రెండు రికార్డులు చేరాయి...

వన్డేల్లో వరుసగా ఐదు సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌వుమెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది మిథాలీరాజ్. సౌతాఫ్రికాతో లక్నోలో జరగిన వన్డేలో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మిథాలీ, ఇంగ్లాండ్ సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ 50+ స్కోరు చేసింది... 

వన్డేల్లో మిథాలీరాజ్‌కి ఇది 59వ హాఫ్ సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది...

మిథాలీరాజ్ అవుటైన తర్వాత రిచా ఘోష్ 29 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు, జులన్ గోస్వామి 24 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయడంతో 225 పరుగుల స్కోరు చేయగలిగింది టీమిండియా...

లక్ష్యఛేదనలో ఆసీస్ ఓపెనర్లు మొదటి వికెట్‌కి 126 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడం, ఆ తర్వాత మరో సెంచరీ భాగస్వామ్యం రావడంతో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ఆస్ట్రేలియా..

77 నెంబర్ జెర్సీతో ఆడుతున్న ఆసీసా హేలీ 77 బంతుల్లో 77 పరుగులు చేసి అవుట్ కావడం మరో విశేషం... హేలీ ఇన్నింగ్స్‌‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి...

మరో ఓపెనర్ రాచెల్ హేన్స్ 100 బంతుల్లో 7 ఫోర్లతో 93 పరుగులు చేయగా కెప్టెన్ మెగ్ లానింగ్ 69 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది...

ఆస్ట్రేలియా, ఇండియా మహిళా జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 24న జరగనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, ఓ టెస్టు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది...

click me!