నెం.1 టీమ్‌గా టీ20 వరల్డ్ కప్‌కి టీమిండియా!... ఇంగ్లాండ్‌, పాక్‌పై గెలిచినా...

First Published Sep 26, 2022, 7:12 PM IST

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని టీమిండియా టాప్ టీమ్‌గా ఆరంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి... ఆస్ట్రేలియాపై స్వదేశంలో టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో గెలిచిన భారత జట్టు, రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ కంటే 7 పాయింట్ల ఆధిక్యం సాధించింది. పాకిస్తాన్‌తో ఏడు టీ20 మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్, మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచినా... భారత జట్టును చేరుకోవడం కష్టమే...

ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఖాతాలో 268 పాయింట్లు ఉండగా, ఇంగ్లాండ్ 261 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా, పాకిస్తాన్ 258 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ 2021 రన్నరప్ న్యూజిలాండ్ ఐదో స్థానంలో ఉండగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఆరో స్థానానికి పడిపోయింది...

టీమిండియా, టీ20 వరల్డ్ కప్  2022 టోర్నీని టాప్ టీమ్‌గా ఆరంభించాలంటే సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ని సొంతం చేసుకుంటే చాలు. మూడో స్థానంలో ఉన్న సౌతాఫ్రికాను ఓడిస్తే భారత జట్టుకీ, ఇంగ్లాండ్‌కీ ఉన్న పాయింట్ల తేడా డబుల్ డిజిట్‌కి చేరుకుంటుంది...

ఒకవేళ సౌతాఫ్రికా చేతుల్లో టీమిండియా ఓడిపోతే మాత్రం నెం.1 ర్యాంకును కోల్పోవాల్సి ఉంటుంది. భారత జట్టుపై సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ సాధిస్తే... టీమిండియాని వెనక్కి నెట్టి, టాప్ పొజిషన్‌లోకి దూసుకెళ్తుంది. 

England vs Pakistan

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్, మిగిలిన మూడు టీ20 మ్యాచుల్లో గెలిస్తే ఇంగ్లాండ్‌ని వెనక్కి నెట్టి టాప్ 2 పొజిషన్‌లోకి దూసుకెళ్తుంది. ఇదే జరిగితే నెం.1 టీమ్‌గా భారత జట్టు, నెం.2 టీమ్‌గా పాకిస్తాన్... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మొదటి మ్యాచ్‌లో తలబడతాయి...

టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 128 పాయింట్లతో టాప్‌లో ఉంటే, భారత జట్టు 114 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా 3, ఇంగ్లాండ్ 4, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక తర్వాతి స్థానాల్లో వరుసగా ఉన్నాయి...

వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ 119 పాయింట్లతో టాప్‌లో ఉంటే న్యూజిలాండ్ 114 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 111 పాయింట్లతో ఉన్న భారత జట్టు, సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేయగలిగితే టాప్ 2లోకి దూసుకెళ్తుంది..  

click me!