Virat Kohli: అది సాధించాలంటే కోహ్లి పూర్తిగా తప్పుకోవడమే బెటర్.. షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

First Published Nov 13, 2021, 2:55 PM IST

Shahid Afridi: టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఆటతీరు సగటు భారత అభిమానులకే కాదు ఇతర దేశాల మాజీలు, సీనియర్లకు కూడా కోపం తెప్పిస్తున్నది. ముఖ్యంగా సారథ్య బాధ్యతల కారణంగా సరైన క్రికెట్ ఆడలేకపోతున్న విరాట్ కోహ్లి.. వాటి నుంచి తప్పుకోవడమే బెటర్ అనే వాదన వినబడుతున్నది. 

కోహ్లి.. ఇప్పటికే టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ స్థానాన్ని రోహిత్ శర్మ భర్తీ చేస్తున్నాడు. మరోవైపు విరాట్ వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోవాలని అభిమానుల నుంచే గాక బీసీసీఐ లోని  పెద్దలు కూడా భావిస్తున్నట్టు సమాచారం. విరాట్.. వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించి వాటిని కూడా రోహిత్ శర్మకు అప్పజెప్పుతారని టాక్ వినిపిస్తున్నది. 

ఈ నేపథ్యంలో ఇదే విషయమై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. ‘టీమిండియా కు గానీ, పాకిస్థాన్ జట్లకు  గానీ కెప్టెన్ గా ఉండటమనేది చాలా పెద్ద బాధ్యతతో కూడిన వ్యవహారం. జట్టు బాగా ఆడినంతకాలం అందరూ  మెచ్చుకుంటూనే ఉంటారు. కానీ విఫలమైతేనే అసలు సమస్య. అభిమానులు దానిని జీర్ణించుకోరు.

విరాట్ కోహ్లి..  మిగతా ఫార్మాట్లలో కూడా సారథ్య బాధ్యతలను వీడితేనే అతడికి మంచిది. సారథ్యం కారణంగా అతడు  బ్యాటింగ్ పై దృష్టి పెట్టలేకపోతున్నాడు. అందుకే అతడు కెప్టెన్ గా వైదొలిగి  ఆటగాడిగా కొనసాగాలి. ఒక నాణ్యమైన బ్యాటర్ గా అతడి సేవలు భారత్ కు చాల అవసరం. కోహ్లిలో ఇంకా చాలా  క్రికెట్ మిగిలుంది..’ అని అఫ్రిది అన్నాడు

బ్యాట్స్మెన్ గా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారని, ఆటగాడిగా వాటిని సాధించాలంటే  నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటేనే ఉత్తమమని అఫ్రిది సూచించాడు.

ఇక టీమిండియా టీ20  సారథి  రోహిత శర్మపై కూడా అఫ్రిది ప్రశంసలు కురిపించాడు.  పొట్టి ఫార్మాట్ లో అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం శుభపరిణామమని అన్నాడు. ఒక్క టీ20 కే గాక అన్ని ఫార్మాట్లలోనూ అతడు సారథిగా ఉంటే బావుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

‘నేను ఐపీఎల్ లో (డెక్కన్ ఛార్జర్స్ తరఫున) రోహిత్ తో కలిసి ఒక ఏడాది (ఐపీఎల్ తొలి ఎడిషన్)  ఆడాను. రోహిత్ ఆటను చాలా దగ్గర్నుంచి గమనించాను. పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో రోహిత్ సిద్ధహస్తుడు.

జట్టు అవసరాల రీత్యా దూకుడుగా ఆడగలడు లేదంటే క్లిష్ట పరిస్థితుల్లో నిలకడగా ఆడతాడు.  అతడి షాట్ల ఎంపిక అద్భుతం. నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. టీమిండియా లో  నాయకత్వ మార్పు సరైనదే.. రోహిత్ కు ఓ అవకాశం ఇవ్వాలి..’ అని తెలిపాడు. 

click me!