వ్యాక్సిన్ వేసుకోడానికి భయపడిన మురళీ విజయ్... కావాలంటే క్రికెట్‌కి దూరంగా ఉంటానంటూ..

First Published Nov 13, 2021, 1:15 PM IST

క్రికెటర్ మురళీ విజయ్‌ టాలెంట్ విషయంలో ఎవ్వరికీ తక్కువేమీ కాదు. టెస్టు ఓపెనర్‌గా భారత జట్టు తరుపున 61 మ్యాచులు ఆడిన మురళీ విజయ్ ఖాతాలో 12 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీతో దాదాపు 4 వేల పరుగులు ఉన్నాయి. అయితే ఇప్పుడు అతన్ని టీమిండియా పట్టించుకోవడం లేదు. కారణం అతని క్రమశిక్షణారాహిత్య పనులే..

కరోనా వైరస్‌ రాకతో ప్రపంచమంతా వణికిపోయింది. పిట్టల్లా మనుషులు గుట్టలు గుట్టలుగా రాలిపోతుంటే, చూస్తూ బాధపడడం తప్ప ఏమీ చేయలేని దయనీయ పరిస్థితిని కూడా చూసిందీ తరం. అలాంటి విపత్తు నుంచి, వైరస్ బారి నుంచి కాపాడిందీ కరోనా వ్యాక్సిన్...

కరోనా వైరస్ ఎంట్రీతో క్రికెట్‌లో రూల్స్‌ మార్చిన క్రికెట్ బోర్డులు, ఆటగాళ్లు అందరూ వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరి చేసింది. కట్టుదిట్టమైన బయో బబుల్‌లోనే కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో కరోనా వ్యాక్సిన్ ఒక్కటే వైరస్‌ని అడ్డుకోగలదనే నమ్మకమే దీనికి కారణం...

అయితే భారత సీనియర్ క్రికెటర్ మురళీ విజయ్ మాత్రం అంతదాకా వస్తే అవసరమైతే క్రికెట్ ఆడడం అయినా మానేస్తా కానీ వ్యాక్సిన్ మాత్రం వేయించుకోనని ఖరాకండిగా చెప్పేశాడు...

2020 సీజన్‌లో లాక్‌డౌన్ కారణంగా దేశవాళీ టోర్నీలను నిర్వహించలేకపోయిన బీసీసీఐ, గత జనవరిలో సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీని నిర్వహించింది. ఇప్పుడు 2021 సీజన్ టీ20 టోర్నీ జరుగుతోంది..

ఈ టోర్నీలో ఆడాలంటే ఆటగాళ్లు అందరూ కచ్ఛితంగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టోర్నీ ప్రారంభానికి వారం రోజుల ముందే బీసీసీఐ ఏర్పాటు చేసే బయో బబుల్‌లోకి రావాల్సి ఉంటుంది...

అయితే 37 ఏళ్ల మురళీ విజయ్ మాత్రం కరోనా నియమాలు పాటించడం తన వల్ల కాదని, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

‘అది పూర్తిగా అతని వ్యక్తిగత నిర్ణయం. వ్యాక్సిన్ వేసుకొమ్మంటే విజయ్ నిరాకరించాడు. అలాగే జట్టుతో కలిసి క్వారంటైన్‌లో ఉండడానికి కూడా ఒప్పుకోలేదు. దీంతో తమిళనాడు సెలక్టర్లు, అతన్ని ఎంపిక చేయలేదు...’ అని అధికారులు తెలియచేశారు...

ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి అంగీకరిస్తే, తమిళనాడు జట్టులో చోటు కల్పిస్తామని సెలక్టర్లు చెప్పినా, మురళీ విజయ్ మాత్రం అందుకు ససేమీరా అన్నట్టు సమాచారం...

37 ఏళ్ల మురళీ విజయ్, 2008లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేశాడు. తన కెరీర్‌లో 61 టెస్టులు, 17 వన్డేలు ఆడిన మురళీ విజయ్, టెస్టుల్లో 3982 పరుగులు, వన్డేల్లో 339 పరుగులు చేశాడు...

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 135 మ్యాచులు ఆడిన మురళీ విజయ్, 25 సెంచరీలతో 9205 పరుగులు, 94 లిస్టు ఏ మ్యాచుల్లో 8 సెంచరీలతో 3644 పరుగులు చేశాడు...

2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన మురళీ విజయ్‌ని ఈ ఏడాది వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. ఆఖరిగా 2018లో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ఆడిన మురళీ విజయ్ కెరీర్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ముగిసినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం...

తమిళనాడుకి 2020 సీజన్‌లో టైటిల్ అందించిన తమిళనాడు కెప్టెన్ దినేశ్ కార్తీక్ మొదటి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మురళీ విజయ్, ఆ విషయం బయటికి తెలియడంతో ఆమెను వివాహం చేసుకున్నాడు...

అయితే ఈ ఏడాది కూడా దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఆడనుంది తమిళనాడు. దీంతో కార్తీక్ కెప్టెన్సీలో ఆడడం ఇష్టం లేక మురళీ విజయ్ ఇలా తప్పుకుని ఉండవచ్చిన అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!