Harshal Patel: నా కెరీర్ పై అతడు చాలా ప్రభావం చూపాడు.. అలా చెప్పడం వల్లే ఇక్కడున్నా : హర్షల్ పటేల్

First Published Nov 20, 2021, 12:33 PM IST

AB De villiers:  శనివారం రాంచీలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో అరంగ్రేటం చేసిన హర్షల్ పటేల్.. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన ఆటపై అత్యంత ప్రభావం చూపాడని.. అతడి సలహాలు తనకు చాలా ఉపయోగపడ్డాయని కామెంట్స్ చేశాడు. 

న్యూజిలాండ్ తో శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఐపీఎల్ లో అదరగొట్టిన హర్షల్ పటేల్.. టీమిండియా తరఫున అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే.  కాస్త లేటుగానే జట్టులోకి ఎంట్రీ ఇచ్చినా హర్షల్.. తొలి  మ్యాచ్ లో అదరగొట్టాడు. కివీస్ ను కట్టడి చేయడంలో అతడది కీలక పాత్ర. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన పటేల్.. 25 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. 

అయితే తన కెరీర్ పై  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు  ఏబీ డివిలియర్స్ ప్రభావం ఎక్కువగా ఉందని హర్షల్ పటేల్ అన్నాడు. నిన్న మ్యాచ్ అనంతరం అతడు స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ లో ఈ ఇద్దరూ  ఆర్సీబీ తరఫున ఆడారు. 

హర్షల్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ మీద ఏబీడీ ప్రభావం అధికంగా ఉంది. నేనెప్పుడూ అతడిని దగ్గరగా పరిశీలిస్తూ ఉండేవాడిని. ఐపీఎల్-14 సీజన్ రెండో దశకు ముందు నేను ఏబీడీ దగ్గరికెళ్లాను. 

ఒక్కో ఓవర్లో నేను భారీగా పరుగిలిస్తున్నాను. అలా ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి..? అని  డివిలియర్స్ ను అడిగాను.  దానికి ఏబీడీ స్పందిస్తూ.. నా బౌలింగ్ లో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. మంచి బంతులు వేసినప్పుడు కూడా బ్యాటర్లు షాట్లు ఆడితే తిరిగి అవే బంతులు వేయాలి. 

షాట్ కొట్టగానే తర్వాత బంతి మార్చి వేస్తారని బ్యాటర్లు అనుకుంటారు. కానీ నువ్వు అవే తరహా మంచి బంతులు వేస్తూ ఉండాలి. అలా వాళ్లను రెచ్చగొడితే బుట్టలో పడే ఛాన్సుంది అని సలహాఇచ్చాడు.

ఏబీడీ ఇచ్చిన సలహా చాలా ఉపయోగపడింది..’ అని పటేల్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ తొలి దశలో నామమాత్రంగానే ఆడిన హర్షల్.. రెండో  దశలో మాత్రం రెచ్చిపోయాడు. వరుస మ్యాచులలో వికెట్లు తీస్తూ ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన ఓ మ్యాచ్ లో హ్యాట్రిక్ కూడా తీశాడు. 

తొలి టీ20లో మహ్మద్ సిరాజ్ గాయపడటంతో  తుది జట్టులోకి వచ్చిన  హర్షల్.. తాను ఇంతకుమించిన  అరంగ్రేటం ఆశించలేనని చెప్పాడు. ‘అంతగా ప్రతిభ లేని నాలాంటి ఆటగాడు  ఆటలో రాణించాలంటే ప్రతి  విషయమూ నేర్చుకోవాలి. మొదట్లో నేను చేసిన తప్పులను గుర్తించి.. నేనేం చేయగలనో లేదో నిర్ధారించుకున్నాను. 

ఆ పై ఎలాంటి బంతులేయాలో గుర్తించి.. వాటిపైనే దృష్టి పెట్టాను. టీమిండియా తరఫున ఆడటం.. ఇక్కడ రాణించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను..’ అంటూ మ్యాచ్ అనంతరం  వ్యాఖ్యానించాడు. 

click me!